
- తప్పు ప్రభుత్వానిది.. శిక్ష ప్రజలకా?
- ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి, 30 శాతం కమీషన్లు దండుకునే ప్రయత్నం0 జరుగుతోందన్నారు. 22ఏ జాబితాలోని భూములును వెంటనే తొలగించి యథాతథ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మంత్రి సారీ చెబితే సమస్య పరిష్కారం కాదని, దీనిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మంగళవారం పట్టణీకరణ భవిష్యత్తు, పట్టణాల అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలపై నిర్వహించిన ‘షెహరోం పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తప్పు చేసింది ప్రభుత్వం. శిక్షను అనుభవిస్తున్నది మాత్రం ప్రజలు. కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. భూ యజమానులను భయభ్రాంతులకు గురి చేసి, కమీషన్లు తీసుకోవడం కోసం ఇదంతా ప్రభుత్వమే చేసింది’’ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 22ఏ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఎదురుదాడి చేయకుండా వాస్తవ సమస్యపై మాట్లాడాలని కేటీఆర్ అన్నారు.
మూడేళ్లుగా పాత కేసులు, పాత విచారణలు, పాత అంశాలనే ప్రభుత్వం ప్రస్తావిస్తోందని, కొత్తగా చేసిన పని ఏమీ లేదన్నారు. ‘‘22ఏపై తప్పకుండా జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలి. అలా జరిగితే అందరికీ మంచిదే”అని చెప్పారు. ధరణి భూ యజమానులకు ఒక రక్షణ కవచంలా, ఇనుప కంచెలా పని చేసేదన్నారు. ప్రస్తుతం భూభారతిలో యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ విషయంలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలకంటే అతిగా పోలీసులు
పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా పని చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపైకి వేలాది గూండాలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిందని ఆరోపించారు. తాము వెళుతుంటే అడ్డుకుని పోలీసు స్టేషన్‌లో పెట్టి.. తమపైకి కూడా కాంగ్రెస్ గూండాలను దాడికి వదిలారన్నారు. ‘‘నా పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్‌రెడ్డిని పోలీసు స్టేషన్‌కు పిలిచి వారి సమక్షంలోనే 15 మంది కాంగ్రెస్ గూండాలతో దాడి చేపించే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత చెత్తగా ఉందో అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు.