Reading Time: < 1 minute
Brain Health: బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే..? మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే..?

మనల్ని, మన జీవితాలను నడిపించే మెదడే అత్యంత కీలకమైన అవయవం. ఇది ఏమాత్రం గాడి తప్పినా మన దైనందిన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవడానికి కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దీనికి ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి మేలు చేస్తాయి. అధిక రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పాలకూరలో విటమిన్ కె, ల్యూటిన్, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. చేపలు, అక్రూట్‌లో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరుకు ఎంతో సహాయపడతాయి.

మానసిక ఉత్తేజం కోసం పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్ చేయడం వంటివి చేయాలి. ఇవి నాడీ కణాలను చురుకుగా ఉంచుతాయి. ప్రతి రోజూ రాత్రి పూట 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూడటం మానుకోవాలి. నలుగురితో కలవడం, మాట్లాడటం, మనసులోని భావాలను పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తగినన్ని ద్రవాలు తీసుకోవడం, వీలైనంత వరకు సిగరెట్లు, మద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది. తలకు గాయాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మోటారు సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్, కారులో సీటు బెల్ట్ ధరించాలి. వృద్ధులు కింద పడిపోకుండా జాగ్రత్తలు పాటించాలి.

బాత్రూంలో పట్టుకునే పట్టీలు, తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కాలుష్యం లేని, ప్రశాంతమైన వాతావరణం మెదడు ఆరోగ్యానికి అత్యవసరం. ఈ పద్ధతులు పాటించడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడి, మానసిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.