Reading Time: < 1 minute
Mukesh Kumar Joins Nottinghamshire For County Championship 2026

Mukesh Kumar Joins Nottinghamshire for County Championship 2026: భారత క్రికెట్ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్న పేసర్ ముకేశ్ కుమార్‌కు బంపర్ ఆఫర్ దక్కింది. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోని నాటింగ్‌ హామ్‌షైర్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు ఒప్పందం కుదిరింది. దీంతో తొలిసారి భారత్ వెలుపల ఓ దేశవాళీ జట్టుకు ముకేశ్ కుమార్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. మూడు టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి 26 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియా తరఫున ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టాడు.

బిహార్‌కు చెందిన ముకేశ్ కుమార్ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడి గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 233 వికెట్లు తీయగా.. 21.79 సగటును మాత్రమే నమోదు చేశాడు. 2024 జనవరిలో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో ముకేశ్ సత్తా చాటాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే ఆలౌట్ కాగా.. ముకేశ్ 2/0 గణాంకాలు నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ముకేశ్ కుమార్ ఇప్పటివరకు 10 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2024 ఫిబ్రవరిలో బిహార్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అతడి కెరీర్‌లోనే అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు నమోదయ్యాయి. ఆ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున ముకేశ్ ఏకంగా 10/50 గణాంకాలతో అదరగొట్టాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దులీప్ ట్రోఫీ ప్రదర్శన అనంతరం నాటింగ్‌హామ్‌షైర్‌తో చేరేందుకు ముకేశ్ సిద్ధమయ్యాడు. నాటింగ్‌ హామ్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అతడు తెలిపాడు. ఇంగ్లాండ్‌కు వెళ్లి కౌంటీ క్రికెట్‌లో తనను తాను పరీక్షించుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. కొత్త పరిస్థితుల్లో కొత్త జట్టుకు ఆడటం సవాల్ అని, నాటింగ్‌ హామ్‌షైర్ విజయానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నాడు.