Reading Time: < 1 minute
Nandyala Avuku Ramapuram Galeru Nagari Canal Three Family Members Missing

Nandyala District: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గాలేరు నగరి కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కాలువలో పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఎనిమిదేళ్ల బాలుడు ఆరుష్ అదుపుతప్పి నీటిలో పడిపోగా, అతడిని కాపాడేందుకు తండ్రి అప్రోజ్ (36), అలాగే ఆయన బామ్మర్ది ఆషీక్ (32) తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే కాలువలో సుమారు 3,200 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండటంతో, బాలుడిని రక్షించబోయిన తండ్రి, బామ్మర్ది ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన అప్రోజ్ ఒక నాపరాతి ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తుండగా, ఆయన బామ్మర్ది ఆషీక్ బేతంచెర్ల అయ్యలూరులోని నాపరాతి ఫ్యాక్టరీలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. కాలువలో కొట్టుకుపోయిన ఈ ముగ్గురి (అప్రోజ్, ఆరుష్, ఆషీక్) కోసం స్థానికులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కళ్లముందే నీటి ప్రవాహంలో గల్లంతు కావడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా, రామాపురం గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.