Reading Time: < 1 minute

ఖైరతాబాద్ గణేశ్ దగ్గర హోమం..ఇవాళ లక్ష మంది దర్శనానికి అవకాశం

Caption of Image.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. గణేష్ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమయాగం నిర్వహించారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎదుట ఏకంగా 102 హోమగుండాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో యాగ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రధాన గణేష్ విగ్రహంతో పాటు కాళీకామాత, సోమనాథ్ జ్యోతిర్లింగం, విశ్వకర్మ, విష్ణుమూర్తి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

బుధవారం కావడంతో సాయంత్రం సమయానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు దాదాపు లక్ష మంది భక్తులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు నలువైపులా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాయంత్రం వేళ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.