
అమరావతి, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. 892 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1 సర్వీసులకు 163 పోస్టులుకాగా.. ఇతర విభాగాలకు 729 పోస్టులు ఉన్నాయి. APPSC అధికారిక వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్ జాబితాలో కొన్ని పోస్టుల్లో మార్పులు చేశారు. గతంలో జాబితాలో ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) పోస్టును తొలగించారు. అలాగే గతంలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (DPO) స్థానంలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DLDO) పోస్టును చేర్చారు. ఇక కొత్తగా గ్రూప్ 1 సర్వీసెస్ జాబితాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) కమ్యూనికేషన్స్, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులను చేర్చారు.
APPSC విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లలో గ్రూప్-1తో పాటు ఫారెస్ట్, మహిళా అభివృద్ధి-శిశు సంక్షేమం, పరిశ్రమలు, జువైనైల్ వెల్ఫేర్, ఎండోమెంట్స్, కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, గిరిజన సంక్షేమం, ఆర్థిక-గణాంకాలు, సోషల్ వెల్ఫేర్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం APPSC అధికారిక నోటిఫికేషన్ జాబితాలో Notification No.07/2026 నుంచి 26/2026 వరకు పలు రిక్రూట్‌మెంట్ ప్రకటనలు వెలువడ్డాయి. సాధారణ అభ్యర్థులకు వర్తించే గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వయోపరిమితి కారణంగా గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి కూడా కొత్త నోటిఫికేషన్ల ద్వారా అవకాశం లభించనుంది.
జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో APPSC ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, ఇతర నిబంధనలను సంబంధిత నోటిఫికేషన్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. APPSC అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్లు, సిలబస్, పరీక్షల షెడ్యూల్, దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉంటాయి.