Reading Time: 2 minutes

పాత రోజుల (1980) ల నాటి బ్లాక్ అండ్ వైట్, సెపియా టోన్ ఫొటోలుగా మన రూపాన్ని మార్చుకునే ‘వింటేజ్ లుక్’ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. పాతకాలపు హెయిర్‌స్టైల్, డ్రెసింగ్‌తో ఫొటోలు భలే ముచ్చటగా కనిపిస్తున్నాయని అంతా మురిసిపోతున్నారు. కానీ, ఈ సరదా వెనుక పెద్ద ముప్పే దాగి ఉందంటుంది సైబర్ ప్రపంచం. మీ చిన్న ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు మీ ఫోన్‌పై కన్నేశారు..ఆ వివరాలు చూద్దాం..

వైరల్ ట్రెండ్.. హ్యాకర్ల కొత్త వల: సోషల్ మీడియాలో ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చిందంటే చాలు.. సైబర్ నేరగాళ్లు వెంటనే రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం వింటేజ్ ఫొటో ఎడిటింగ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు రకరకాల నకిలీ లింకులు, యాప్‌లతో సిద్ధమయ్యారు. ఇక మన బలహీనతను ఆసరాగా చేసుకుని మొబైల్‌లోకి జొరబడేందుకు కుట్ర పన్నుతున్నారు.

Want a Vintage Phone Look? Avoid This Mistake to Stay Safe From Hackers
Want a Vintage Phone Look? Avoid This Mistake to Stay Safe From Hackers

ఆకర్షణీయమైన పేర్లు.. మాయ చేసే మాటలు: “ఏఐ వింటేజ్ ఫోటో మేకర్”, “80ల నాటి రెట్రో లుక్” అంటూ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్‌లలో రంగురంగుల ప్రకటనలు కనిపిస్తాయి. “ఎలాంటి వాటర్‌మార్క్ ఉండదు, ప్రీమియం ఫీచర్లు ఉచితం” అని చెప్పి మిమ్మల్ని ఆకర్షిస్తారు. ఇక ఆ మాటలు నమ్మి క్లిక్ చేశారో.. నేరుగా హ్యాకర్ల వలలో పడినట్లే.

నకిలీ ఏపీకే ఫైళ్లతో అసలు ప్రమాదం: ఈ నకిలీ వెబ్‌సైట్లు గూగుల్ ప్లేస్టోర్‌లో లేని అనధికారిక ‘ఏపీకే (APK)’ ఫైళ్లను డౌన్‌లోడ్ చేయమని కోరతాయి. “ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తేనే ఫొటో రెడీ అవుతుంది” అని మిమ్మల్ని నమ్మిస్తాయి. ఇక మీరు ఆ సెట్టింగ్స్ ఓకే చేసి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే.. అందులోని మాల్వేర్ మీ ఫోన్‌లోకి సైలెంట్‌గా ప్రవేశిస్తుంది.

అనుమతుల పేరిట ఆస్తికే ఎసరు: యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక కెమెరా, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, గ్యాలరీ అనుమతులను ఓకే చేయమని అడుగుతుంది. ఇక ఒక్కసారి వాటికి పర్మిషన్ ఇచ్చారంటే.. మీ పర్సనల్ ఫొటోలు, బ్యాంకింగ్ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మీ ఫొటో వింటేజ్‌గా మారడం ఏమో గానీ, బ్యాంక్ ఖాతా మాత్రం ఖాళీ అయిపోతుంది.

ఇక సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ కలర్‌ఫుల్ లింక్ సురక్షితం కాదు. కాసేపటి సరదా కోసం ఏవో థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసి, మీ విలువైన వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడేసుకోకండి.

గమనిక: ఎల్లప్పుడూ అధికారిక గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచే నమ్మకమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. తెలియని లింకుల ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను అస్సలు ఇన్‌స్టాల్ చేయకండి.

The post వింటేజ్ లుక్ కోసం ఈ తప్పు చేస్తున్నారా? మీ ఫోన్ హ్యాకర్ల టార్గెట్ కావొచ్చు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.