Reading Time: 2 minutes
Off The Record On Repalle Ycp Plan Reverse

పక్కాగా ప్లాన్‌ చేశారు. పర్‌ఫెక్ట్‌ స్కెచ్‌ వేశామనుకున్నారు. ఇంకేముంది ఈసారి గట్టిగా కొట్టబోతున్నామనుకున్నారు. పార్టీ పెట్టాక ఇప్పటి వరకు పాగా వేయలేని నియోజకవర్గంలో ఈసారి జెండా పాతబోతున్నాంటూ సంబరపడ్డారు వైసీపీ నేతలు. కట్‌ చేస్తే… సీన్‌ రివర్స్‌ ఒకరికి ఇద్దర్ని చేర్చుకుని ఫ్యాన్‌ స్పీడ్‌ డబుల్‌ చేశామని అనుకుంటుండగానే…ఉన్నట్టుండి బేరింగ్స్‌ జామ్‌ అయిపోయాయి. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? అక్కడున్న ప్రత్యేక రాజకీయ వాతావరణం ఏంటి?

బాపట్ల జిల్లాలో కీలకమైన నియోజకవర్గం రేపల్లె. ఇక్కడ పాగా వేయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు వరుసగా విఫలమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రేపల్లెలో ఫ్యాన్‌ జెండా ఎగరలేదు. 2014లో వైసీపీ అభ్యర్దిగా మోపిదేవి వెంకట రమణ పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా నడిచినా రేపల్లెలో మాత్రం సైకిల్‌ స్పీడ్‌కు బ్రేకులేయలేకపోయింది. అప్పుడు సైతం అనగాని సత్యప్రసాద్ మోపిదేవి వెంకటరమణపై వరుసగా రెండోసారి విజయం సాధించారు. దీంతో ఇక్కడి వైసీపీ శ్రేణుల్ని ఒక రకమైన నిరాశ ఆవహించింది. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిని మార్చి చేసిన ప్రయోగం కూడా విఫలమైంది. మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ కొడుకు గణేష్‌ను బరిలో దించింది వైసీపీ. అయినా ఫలితం మాత్రం మారలేదు. వరుసగా మూడోసారి రేపల్లె నుంచి గెలిచి హ్యాట్రిక్‌కొట్టి మంత్రి కూడా అయ్యారు అనగాని. ఆ రకంగా… టీడీపికి కంచుకోటగా మారిన రేపల్లెలో ఎలాగైనా జెండా ఎగరేయాలని ఈసారి ముందుగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ.

అందుకు తగ్గట్టుగానే… పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ఇన్ఛార్జ్‌గా ఉన్న ఈవూరి గణేష్‌ను తప్పించి ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన పీటా నాగమోహనకృష్ణను నియమించింది. పీటా కూడా మొదట్లో బాగా హడావిడి చేశారు. దీంతో అప్పటి వరరకూ సైలెంట్‌గా ఉన్న రేపల్లె వైసీపీలో కాస్త ఊపు వచ్చింది. ఇదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పావులు కదిపారు. ఈ నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం ఓటర్లు అత్యధికంగా 45వేల వరకు ఉన్నారు. ఆ తర్వాత కాపు ఓటర్లు 40వేల వరకూ ఉన్నారు. దీంతో కాపు సామాజికవర్గం నేతలపై వైసీపీ కన్ను పడింది. రేపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాపు సామాజికవర్గానికి చెందిన మోపిదేవి శ్రీనివాసరావును ఐదు నెలల క్రితం వైసీపీలో చేర్చుకున్నారు. నియోజకవర్గంపై అవగాహన ఉన్న నేత కావడంతో ఆయన చేరిక కొత్త జోష్ నింపింది. అదే ఊపులో… మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన నేత గూడపాటి శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరారు. దీంతో… ఫ్యాన్‌ స్పీడ్‌ డబులైందని సంబరపడ్డారు. గూడపాటికి రేపల్లె టౌన్‌లో గట్టి పట్టుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇస్తామని భావించారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు 2029 ఎన్నికల్లో రేపల్లెలో వైసీపీ గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయని కూడా సంబరపడ్డారు. ఆ సంబరం అలా కొనసాగుతుండగానే…పార్టీ ప్లాన్ గ్రౌండ్ లెవల్‌లో రివర్స్ అయ్యింది. మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆ వ్యవహారం రేపల్లెలో కలకలం సృష్టించింది. మోపిదేవి పక్కా వ్యూహంతోనే వైసీపీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు కూడా పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారట ఆయన. ఆ లక్ష్యంతోనే పార్టీ మారినా…. ఇన్ఛార్జ్‌ పీటా నాగమోహనకృష్ణతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారట. సొంతంగా నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు… పార్టీ కార్యక్రమాల్లో ఇన్ఛార్జ్‌తో కలిసి పాల్గొనడానికి ఇష్టపడలేదని ప్రచారం జరిగింది. దాంతో… మోపిదేవి శ్రీనివాసరావు వ్యవహారశైలి పీటాకు ఇబ్బందిగా మారిందట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించడంతో… వాళ్ళు పిలిచి కలిసి మెలిసి పనిచెయ్యాలని సూచించినట్లు చెబుతున్నారు పీటా వర్గీయులు. అయితే మోపిదేవి శ్రీనివాసరావు మాత్రం పద్దతి మార్చుకోకుండా ముందుకెళ్లారంటున్నారు. రాజకీయాల్లో జూనియర్ అయిన ఇన్ఛార్జ్‌ పీటాను మోపిదేవి లైట్ గా తీసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో నాగమోహన కృష్ణ మరోసారి పార్టీ పెద్దల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడం, ఇద్దరూ కలిసి ముందుకెళ్ళే అవకాశం కనిపించకపోవడంతో మోపిదేవి శ్రీనివాసరావును పార్టీనుంచి సస్పెండ్ చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాపు సామాజికవర్గానికి చెందిన నేతను ఇలా సస్పెండ్ చెయ్యడం వైసీపీకి ఇబ్బందిగా మారవచ్చన్న లెక్కలు పెరుగుతున్నాయి. ఇలా ఎంత మందినిమార్చి ఎన్ని ప్రయోగాలు చేసినా…రేపల్లె ఫ్యాన్‌ మాత్రం తిరగడం లేందటూ చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో.