Reading Time: 2 minutes
Pakistan U-19: సీనియర్లు సైలెంట్.. జూనియర్లు వైలెంట్.. ఇంగ్లాండ్‌ను 200 పరుగులతో ఉతికేసిన పాక్ కుర్రాళ్లు

Pakistan U-19: అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ సీనియర్ జట్టు ఎప్పుడూ లేని విధంగా ఫామ్ లేమితో వరుస పరాజయాలతో సతమతమవుతుంటుంది. కానీ, వారి అండర్-19 యువ జట్టు మాత్రం ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మకమైన నాల్గవ, చివరి వన్డే మ్యాచ్‌లో పాక్ అండర్-19 జట్టు ఏకంగా 200 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-1 తేడాతో పాకిస్తాన్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. సీనియర్ల తరహాలో కాకుండా యువ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ రాణించి ఈ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

దుమ్ములేపిన పాక్ టాప్ ఆర్డర్

ఈ చివరి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 350 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. పాక్ ఇన్నింగ్స్‌లో టాప్-5 బ్యాటర్లలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ అజేయంగా 80 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఓపెనర్లు ఉస్మాన్, జహంగీర్ చెరో 79 పరుగులు చేసి శుభారంభం అందించగా, మరో బ్యాటర్ అహ్మద్ హుసేన్ 63 పరుగులతో రాణించాడు.

కుప్పకూలిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అండర్-19 జట్టు పాకిస్తాన్ బౌలర్ల ధాటికి తీవ్రంగా తలవంచింది. ఇంగ్లాండ్ జట్టు కేవలం 20.4 ఓవర్లలోనే 150 పరుగులకే ఆలైట్ అయింది. ముఖ్యంగా పాక్ బౌలర్లు మ్యాచ్ చివరి దశలో చలరేగిపోయారు. ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు 16.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ చివరి 5 వికెట్లను కేవలం 18 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో స్కోరు బోర్డు 132/5 నుంచి ఒక్కసారిగా 150/10కి పడిపోయి ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

సిరీస్ పోరులో పాక్ పూర్తి ఆధిపత్యం

ఈ ఐదు మ్యాచ్‌ల పర్యటనలో పాకిస్తాన్ అండర్-19 జట్టు ఆరంభం నుంచే అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. తొలి వన్డేలో 177 పరుగుల భారీ తేడాతో, రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో ఘన విజయాలు సాధించింది. కేవలం మూడో వన్డేలో మాత్రమే ఇంగ్లాండ్ కేవలం 2 తేడాతో గెలుపొందింది. కానీ, చివరిదైన నాల్గవ వన్డేలో మరోసారి అదరగొట్టిన పాక్ యువ జట్టు 200 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..