
పన్నీరు.. ఈ పేరు చెప్పగానే శాకాహారులతో పాటు మాంసాహారులు కూడా అబ్బా అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు… పన్నీర్ అనేది పాలతో తయారు చేసే ఒక అద్భుతమైన పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థం… శాకాహారులకు ముఖ్య ఆహారంగా నిలుస్తున్న ఈ పన్నీరులో కూడా కల్తీ చేస్తున్నారని కోనసీమలో కలకలం రేగింది. ఇటీవల అమలాపురానికి చెందిన ఒక కుటుంబం పన్నీర్ తిని విరోచనాలు, వాంతులు బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కోనసీమలో కల్తీ పన్నీరు కలకలం రేగింది. దీంతో కొందరు డైరెక్ట్ గా సి.ఎం.ఓ కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన సీఎమ్ఓ కోనసీమ జిల్లా అధికారులను అలర్ట్ చేశారు.
బాధితుల ఫిర్యాదుతో కదిలిన సీఎంఓ:
వెంటనే కోనసీమలో ప్రధానంగా అమ్ముడుపోతున్న కేంద్రాల్లో పన్నీర్ శాంపిల్స్ సేకరించి చర్యలు చేపట్టాలని కోనసీమ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, రెవిన్యూ యంత్రాంగం కోనసీమలోని అమలాపురం, రావులపాలెంలలో పన్నీర్ విక్రయిస్తున్న 5 ప్రధాన వ్యాపార దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. ఈ ప్రాంతాల్లో పన్నీరులో కల్తీ జరుగుతుందా అనే కోణంలో ఆ శాంపిల్స్ ను మద్రాస్ పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. లక్ష్మి, రావులపాలెం తాసిల్దార్ ముక్తేశ్వరరావు తెలిపారు.
వాస్తవానికి రైతు దగ్గర నుంచి గేదె పాలు సేకరించి పాలలో వెనిగర్ లేదా నిమ్మరసం వేసి పన్నీర్ తయారు చేస్తారు. ఒక కేజీ పన్నీర్ తయారు కావాలంటే 5 నుంచి 6 లీటర్ల పాలు కావాల్సి ఉంటుంది. ఇలా తయారైన పన్నీర్ వైట్ కలర్, లేదా క్రీమ్ కలర్ లో కనిపిస్తూ పట్టుకోవడానికి మెత్తగా స్పాంజ్ లా ఉంటుంది. ఈ పన్నీర్ లో ప్రోటీన్, కాల్షియం, గుడ్ ఫ్యాట్, ఫాస్పరస్, విటమిన్ B 12, A ఉంటాయి. ఇది కేజీ రూ.400 నుంచి రూ.500 వరకు ధర ఉంటుంది. కాగా పాలకి బదులు వనస్పతి, చౌకైన కొవ్వులు, పిండి పదార్థాలు, నాన్ డైరీ ప్రోటీన్ వంటి వాటితో కొన్నిచోట్ల నకిలీ పన్నీర్ తయారవుతుంది. ఇది పట్టుకుంటే గట్టిగా ఉండడంతో పాటు కేజీ రూ.100 కే దొరుకుతుంది.
ఇటువంటి నకిలీలు గానీ కోనసీమలో ప్రవేశించాయా అనే కోణంలో అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. గతంలో ఇప్పటికే కోనసీమలోని మలికిపురం, మోరి వంటి ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించగా అవి నకిలీ పన్నీర్ కాదని తేలింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో సేకరించిన శాంపిల్స్ కు సంబంధించి రిపోర్ట్లు వస్తేనే గాని అసలు విషయం బయట పడదని అధికార యంత్రాంగం చెబుతున్నారు.