Reading Time: < 1 minute
Dragon Release Date Delay Ntr Prashanth Neel Film Faces New Buzz

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్‌పై సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అనుకున్న తేదీకి డ్రాగన్ విడుదల కావడం కష్టమేననే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. షూటింగ్ పనుల్లో చోటుచేసుకున్న జాప్యమే ఇందుకు ప్రధాన కారణం.

ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆయనకు సర్జరీ కూడా జరగడంతో.. షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ వచ్చింది. దీంతో ఇప్పటికే ప్లాన్ చేసిన షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా అనుకున్న తేదీకి సినిమా విడుదల దాదాపు అసాధ్యమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సినిమాల మేకింగ్‌లో క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ డీటెయిలింగ్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడరు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయిస్తారు.

ఈ నేపథ్యంలో జూన్ 11న డ్రాగన్ సినిమాను విడుదల చేయాలనే డెడ్‌లైన్‌ను అందుకోవడానికి హడావుడి చేయడం కంటే.. సినిమాకు అవసరమైన సమయం కేటాయించి అత్యుత్తమ అవుట్‌పుట్ తీసుకురావడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో డ్రాగన్ విడుదల వాయిదా పడే అవకాశాలపై చర్చ మొదలైంది. ఒకవేళ జూన్ 11 రిలీజ్ డేట్‌ను మేకర్స్ మిస్ చేస్తే.. 2027 దసరా సీజన్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ప్రస్తుతం జూన్ 11 2027నే అధికారిక రిలీజ్ డేట్‌. కాబట్టి షూటింగ్ ఆలస్యం, రిలీజ్ వాయిదా, దసరా విడుదల వంటి ప్రస్తుతానికి ఈ వార్తలను రూమర్స్‌గానే చూడాలి.