
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET) 2026కు సంబంధించిన సబ్జెక్టుల వారీ షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 29 సబ్జెక్టులకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. TG-SET 2026 పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2026 నుంచి తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌లో పరీక్ష సమయం, పరీక్షా కేంద్రం తదితర పూర్తి వివరాలు ఉంటాయి.
తెలంగాణ సెట్ 2026 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
300 మార్కులకు పరీక్ష
TG-SET పరీక్ష మొత్తం 300 మార్కులకు, 3 గంటల (180 నిమిషాలు) వ్యవధిలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్, టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు చొప్పున అడుగుతారు. అభ్యర్థి ఎంచుకున్న సంబంధిత సబ్జెక్టుపై ఈ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు పరీక్షకు ముందే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో పేర్కొన్న పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేంద్రం వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి.