Reading Time: 2 minutes
మనవరాలిని పెంచినందుకు రూ. 51 లక్షలు డిమాండ్ చేస్తూ కొడుకుపై దావా వేసిన బామ్మ

చర్చకు దారితీసిన ఘటన

 

ఇప్పటివరకు తన సొంత మనవరాళ్ల పెంపకంలో నానమ్మ ప్రేమ మాత్రమే కనిపించేదనీ అది వారికి ఎంత కష్టంగా ఉన్నప్పటికీ సమాజం వారి త్యాగంగా మాత్రమే చూస్తూ వచ్చింది సమాజం. వృద్ధాప్యంలో మనవరాళ్ల పెంపకం వారికి భారం కాకుండా ఇకపై ప్రభుత్వ సంరక్షణలో భాగం కావాలి అనే డిమాండ్ చైనాలో వినిపించింది. ఈ కేసు  చైనాలో పెద్ద చర్చకు దారి తీసింది. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’  కథనంతో ఈ కేసు వివరాలు వెలుగులోకి వచ్చింది.  60 ఏళ్ల వయసున్న షు అనే మహిళ, తన కొడుకు లియాంగ్ నుండి మనవరాలి పెంపకం ఖర్చుల కింద 360,000 యువాన్లు అంటే దాదాపు రూ. 51 లక్షలకు దావా వేసినట్లు షాంఘై లోని పీపుల్స్ కోర్టు వివరాలను వెల్లడించింది.

భర్తకు విడాకులు ఇచ్చిన ‘షు’, తన కొడుకుతో కలిసి నివసిస్తున్న సమయంలో, 2014లో కొడుకు కూడా విడాకులు తీసుకున్నాడు. దాంతో ఆమె అప్పుడు నాలుగేళ్ల వయసున్న తన మనవరాలి సంరక్షణను బాధ్యతగా తీసుకుంది. ఆ తర్వాత ఆమె కొడుకు మరో పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోవడంతో, ఆ పాప పెంపకం బాధ్యత పూర్తిగా “షు” పై పడింది. దాదాపు 15 సంవత్సరాల పాటు “షు” పాప వైద్య, విద్య ఖర్చులను భరించింది. ఇకపై ఆ ఆర్థిక భారాన్ని తాను మోయలేనని భావించిన ఆమె, తన కొడుకు “బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడని, తండ్రిగా తన విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యాడని” ఆరోపిస్తూ ఇటీవల కోర్టులో దావా వేసింది.

తన నెలవారీ ఆదాయం కేవలం 3,000 యువాన్లు అని,  కూతురికి  తను చేయగలిగినంత సహాయం చేశానని కొడుకు తరపు న్యాయవాది వాదించాడు.  కాగా, కోర్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ద్వారా, అతను తన తల్లికి 200,000 యువాన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 23 లక్షల పరిహారాన్ని చెల్లించడానికి అంగీకరించాడు.  వృద్ధాప్యంలో పిల్లల పెంపకం లేదా ‘ట్విలైట్ చైల్డ్ కేర్’ సమస్యలను ఈ ఘటన హైలైట్ చేసింది.

చైనాలో బామ్మలు తమ మనవలు మనవరాళ్లను ఏళ్ల తరబడి పెంచిన తర్వాత, వారి ఖర్చుల కోసం పిల్లల నుంచి పరిహారం కోరడం ఇది మొదటిసారి కాదు. బీజింగ్‌లో జరిగిన ఓ కేసులో ఓ వృద్ధ జంట 320,000 యువాన్లు కోరారు.  కాగా,  పిల్లల సంరకణ చేపట్టిన సమయంలో బామ్మ, తాతల ఆరోగ్యం క్షీణించిన కేసులూ ఉన్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని ఓ 59 ఏళ్ల మహిళ ఆరు నెలలు మనమడిని చూసుకునే క్రమంలో 20 కిలోలు బరువు కోల్పోయి, చివరకు ఆందోళనతో యాంగ్జైటీ డిజార్డర్‌ బారిన పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.