
ఒకప్పుడు ఒంట్లో నలతగా ఉన్నా ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా… ‘ఏం కాదులే… రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందిలే’ అనుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు సిచ్యుయేషన్ అలా లేదు. జ్వరం, తలనొప్పి, దగ్గు వచ్చినయంటే చాలు వైరల్ ఫీవరో.. డెంగ్యూ జ్వరమో.. మలేరియా లాంటి విష జ్వరాలు వచ్చాయోమోనన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత గానీ మనసు నిమ్మలం అయితలేదు. పైగా ఇది వర్షా కాలం. ఈ సీజన్లో వైరల్ ఫీవర్లు ఎక్కువ. డెంగీ, టైఫాయిడ్, మలేరియా, చికున్ గున్యా వంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు డాక్టర్లు…
జ్వరం వచ్చిన మొదటిరోజే అది దేని వల్ల వచ్చిందో చెప్పలేం. రెండు మూడు రోజుల తర్వాత దానికి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. అందుకే ఫీవర్ రాగానే ఫీవర్ ఎంత ఉంది? జ్వరంతో పాటు ఏమేం లక్షణాలు ఉన్నాయి? అనేది గమనించాలి. రెండు మూడు రోజులు అయినా కూడా జ్వరం తగ్గకుంటే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి. బ్లడ్ టెస్టు కూడా చేయించుకోవాలి. ఛాతి ఎక్సరే , స్కానింగ్ తీయించుకుంటే మరీ మంచిది. వానాకాలంలో జ్వరాలు ఎక్కువ రావడానికి దోమకాటు, కలుషితమైన తిండి, నీళ్లు ప్రధాన కారణాలు. దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ, చికున్ గున్యా, వైరల్ ఫీవర్స్ వస్తాయి. కలుషితమైన నీళ్లు తాగినా. తిండి తిన్నా టైఫాయిడ్, లెప్టోస్పైరా వంటి బ్యాక్టీరియల్ డిసీజ్ లు వచ్చే ఛాన్సులు ఎక్కువ.
డెంగీ: ఎడిస్ ఈజిప్ట్ అనే ఆడ దోమ కుట్టడం వల్ల డెంగీ ఫీవర్ వస్తుంది. ఈ దోమ పగటిపూటనే కుడుతుంది. జ్వరం, తలనొప్పి, కళ్ల నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటిపై ఎర్రని మచ్చలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం. విరేచనం నల్లగా ఉండడం.. లాంటివి డెంగీ ఇన్ఫెక్షన్లో కనిపిస్తాయి.
కొందరిలో జ్వరం తగ్గిన తర్వాత రక్తస్రావం, బీపీ తగ్గిపోయి మూత్రం సరిగా రాకపోవడం లాంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ ఫీవర్ ఉన్నవాళ్లకి ఆస్పిరిన్, బ్రూఫెన్ లాంటి మెడిసిన్స్ ఇవ్వొద్దు..స్టిరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ప్లేట్ లెట్స్ కౌంట్ టెస్ట్ చేయించుకొని అవసరమైతే ఎక్కించుకోవాలి.
మలేరియా: ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. ఈ దోమ కుట్టిన రెండు వారాల్లో జ్వరం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
టైఫాయిడ్ : దీనికి కారణం సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా. టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఒళ్లు కాలిపోతుంది. తలనొప్పి, డయేరియా, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషితమైన తిండి, నీళ్లు.. ఈ రెండూ టైఫాయిడ్ వ్యాప్తికి కారణ మవుతాయి. యాంటీ బయాటిక్స్, ఫ్లూయిడ్స్ ట్రీట్మెంట్ తో టైఫాయిడ్ తగ్గిపోతుంది.
ఫీవర్ రాగానే డెంగ్యూనా.. మలేరియానా.. టైఫాయిడ్ అనేది చెప్పలేం. అన్నింటిలో లక్షణాలు సుమారు ఒకేలా ఉంటాయి. రెండు మూడురోజులయ్యాక కూడా లక్షణాలు అలానే ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒంటి మీద ర్యాషెస్ ఉన్నాయా?వాంతులు అవుతున్నాయా? కడుపునొప్పి ఉందా?. విరేచనం సరిగా అవుతుందా? అనేది పరీశీలించాలి.. బ్లడ్ టెస్ట్ కంపల్సరీ..
ప్లేట్లెట్స్ తగ్గాయా? అన్నది చెక్ చేస్తారు. జ్వరంతో పాటు దగ్గు, జలుబు, వళ్లు నొప్పులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఫీవర్ లక్షణాలు మునుపటి కంటే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అలాంటి వాళ్లలో ఏ రకం ఫీవర్ అనేది గుర్తించడం కొంచెం కష్టమని వైద్య నిపుణులు అంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ఇంటి చుట్టుపక్కల వర్షం నీరు నిల్వకుండా చూసుకోవాలి. అలాగే ఓపెన్ డ్రైనేజీ లేకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి.
- దోమలు కుట్టకుండా ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు వేసుకోవాలి. ఓడొమాస్ వంటి క్రీమ్స్ రాసుకోవాలి.
- ఇంట్లో దోమ తెరలు వాడాలి. ఇంటి పరిసరాల్లో తరచూ ఫాగింగ్ చేయించాలి.
- ఫుడ్ వేడిగా ఉన్నప్పుడే తినాలి.
- కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇమ్యూనిటీ పెంచే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి ఎక్కువగా తినాలి.
సెల్ఫ్ మెడిసిన్ సేఫ్ కాదు
ఫీవర్ కి ఒకటి రెండు రోజులు సెల్ఫ్ మెడిసిన్ పర్లేదు. కానీ, ఆ తర్వాత సెల్ఫ్ మెడిసిన్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే… ఫీవర్ రాగానే యాంటీ బయాటిక్స్ వేసుకోవడం మొదలు పెడితే అది ఏ ఫీవర్ అనేది తెలియదు. అలాగే, కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. అలాంటి వాళ్లు యాంటీ బయాటిక్స్ ఎక్స్ట్రా ట్రా కోర్సు వాడితే, వాటి వల్ల సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి.