Reading Time: < 1 minute

హౌతీల వరుస దాడులు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ

Caption of Image.
  • బాబ్ అల్-మందబ్‌‌పై పట్టు కోసం పోరాటం
  • హౌతీలపై చర్యలకు పాకిస్తాన్ నిరాకరణ

దుబాయ్‌‌: యెమెన్ హౌతీల వరుస దాడులతో సౌదీ అరేబియా తీవ్ర ఒత్తిడిలో పడింది. సోమవారం హౌతీలు సౌదీలోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయగా.. మంగళవారం కూడా పలు నగరాల్లో టెన్షన్ ​కొనసాగింది. అమెరికా, పాకిస్తాన్ నుంచి ప్రత్యక్ష సైనిక సాయం అందకపోవడంతో సౌదీ ఇప్పుడు ఇజ్రాయెల్ సాయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా పరోక్షంగా నిఘా, టెక్నాలజీ సాయం అందించే విషయంలో సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.  

సోమవారం హౌతీలు సౌదీ దక్షిణ ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించారు. ఖమీస్ ముషైత్‌‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌‌బేస్‌‌పై కూడా దాడి చేసినట్లు ప్రకటించారు. ఈ దాడుల్లో 13 మంది పౌరులు గాయపడ్డారని సౌదీ మంగళవారం వెల్లడించింది. యెమెన్‌‌లో కూడా సౌదీ మద్దతున్న బలగాలపై హౌతీలు దాడులు జరిపారు. పశ్చిమ యెమెన్‌‌లో ప్రభుత్వ బలగాలకు చెందిన 8 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. 

హౌతీల స్థావరాలపై సౌదీ కూడా దాడులు చేసింది. మరోవైపు, హౌతీలు ఎర్రసముద్ర తీరంలో తమ ఆధీనాన్ని పెంచుకున్నారు. బాబ్ అల్-మందబ్ సమీపంలోని కీలక దీవులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. హౌతీల దాడులు పెరగడంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌‌తో భేటీ అయ్యారు. అంతకుముందే హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్యకు దిగాలని అమెరికాను సౌదీ కోరినట్లు వార్తలు వచ్చాయి. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష దాడులకు అంగీకరించలేదని సమాచారం. పాకిస్తాన్ విషయంలోనూ సౌదీకి భరోసా దక్కలేదు. సౌదీ, పాకిస్తాన్, తుర్కియేల మధ్య ఇటీవల కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ.. యెమెన్‌‌లో హౌతీలపై సైనిక చర్య తీసుకోవడంపై ప్రస్తుతం చర్చ లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.