Reading Time: < 1 minute
Bjp Mla Paidi Rakesh Reddy Threatens Resignation Over Armur Development

BJP MLA Paidi Rakesh Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇతర నియోజకవర్గాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారని, ఆర్మూర్ అభివృద్ధి కోసం తాను రెండేళ్లుగా తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు.

ఆర్మూర్‌లో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు, మౌలిక వసతుల కోసం తాను పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినట్లు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయం కోసం రెండేళ్లుగా అడుగుతున్నానని చెప్పారు. ఆర్మూర్‌లోని పాత రెవెన్యూ కార్యాలయాల పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ప్రజలకు, అధికారులకు అనుకూలంగా ఉండేలా కొత్త మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పరిగి, కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు భారీగా నిధులు వెళ్తున్నాయని రాకేశ్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన నిధులు, నిజామాబాద్ జిల్లాకు వచ్చిన నిధుల వివరాలను సభ ముందుంచుతానని చెప్పారు. తాను మొత్తం లెక్కలు తీసుకొచ్చానని, వాటిని వివరించిన తర్వాతే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. ఆర్మూర్ సమస్యలపై మాట్లాడేందుకు తనకు సభ చివర్లో 10 నిమిషాల సమయం ఇవ్వాలని రాకేశ్ రెడ్డి స్పీకర్‌ను కోరారు. అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సభలో ప్రకటించారు. “నేను ఇవాళ రాజీనామా చేయాలి అనుకుంటున్నాను.. సీరియస్‌గానే చెబుతున్నా” అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని రాకేశ్ రెడ్డి కోరారు. జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కనీసం అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతులను కల్పించాలని కోరారు.