
Prithviraj Sukumaran on SS Rajamouli Working Style: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న వారణాసిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పృథ్వీరాజ్ వారణాసి మూవీ, రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కుంభ పాత్ర చాలా ఛాలెంజింగ్:
వారణాసిలో తాను పోషిస్తున్న కుంభ పాత్ర శారీరకంగా ఎంతో సవాలుతో కూడుకున్నదని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ‘కుంభ పాత్ర శారీరకంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. నా పాత్రకు శారీరక వైకల్యం ఉంటుంది. చేతులు, కాళ్లు ఒకే పొజిషన్‌లో లాక్ అయినట్లు నటించాల్సి వచ్చింది. ఇలాంటి పరిమితులతో నటించాల్సి ఉన్నప్పటికీ.. సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాల్సి రావడం నాకు శారీరకంగా చాలా కష్టంగా అనిపించింది. అయితే అది నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. కుంభ పాత్ర సినిమాలో అత్యంత శక్తివంతమైనది’ అని పృథ్వీరాజ్ చెప్పారు.
నటులకు ప్రత్యేక వాతావరణం:
దర్శకుడు రాజమౌళి వర్కింగ్ స్టైల్‌పై కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసలు కురిపించారు. ‘ఎంత భారీ స్థాయిలో సెట్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. షూటింగ్ సమయంలో రాజమౌళి దృష్టి ప్రధానంగా నటుల పర్‌ఫార్మెన్స్, క్లోజప్ షాట్లపై ఉంటుంది. సెట్‌లో ప్రతి నటుడికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. జక్కన్న దర్శకత్వంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే అయన పర్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చే వరకు సీన్స్ తీస్తుంటారు. ఓ యాక్టర్ నుంచి అత్యుత్తమ నటనను రాబడతారు’ అని పృథ్వీరాజ్ చెప్పారు.
మహేష్, ప్రియాంకతో నటించడం నా అదృష్టం:
‘మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు ఎంతో గొప్ప అనుభూతి. మహేష్ తెలుగు చిత్రసీమలో అతిపెద్ద సూపర్‌స్టార్లలో ఒకరు. ప్రియాంక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన నటి. అయితే రాజమౌళి సెట్‌లో స్టార్‌డమ్ కంటే కథ, పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నేను నా దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలో రాజమౌళి నుంచి మెసేజ్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి కథ నరేషన్ విన్న తర్వాత.. తాను ఊహించిన దానికంటే చాలా పెద్ద స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని అర్థమైంది’ అని పేర్కొన్నారు.
బ్యాడ్ గైగా నటించడంలో కిక్కుంటుంది:
‘వారణాసి కథ క్రీస్తు పూర్వం 7000 సంవత్సరం నుంచి 2027 వరకు ఉంటుంది. ఇలాంటి కథా పరిధి, భారీ అడ్వెంచర్ స్కేల్‌తో రూపొందుతున్న ఈ సినిమా భారతీయ సినిమాలో ఒక కొత్త తరహా జానర్‌ను పరిచయం చేస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మాకు నెగెటివ్, గ్రే, పాజిటివ్ పాత్రలు చేయడం సహజమే. స్టార్ ఇమేజ్ ఉన్న నటులు విలన్ లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం మలయాళంలో సాధారణం. ముఖ్యంగా బ్యాడ్ గైగా నటించడంలో నాకు ప్రత్యేకమైన కిక్ ఉంటుంది’ అని పృథ్వీరాజ్ వెల్లడించారు. వారణాసిలో పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్ర ఆయన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన పాత్రగా నిలిచే అవకాశం ఉంది.