Reading Time: 2 minutes
Off The Record Over Ap Politics

 

అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కొట్లాడిన మూడు పార్టీల నేతలు ఇప్పుడు అక్కడ కీచులాటలకు కేరాఫ్‌గా మారిపోయారా? వీళ్ళ తీరు చూస్తుంటే… లోకల్‌ ఎన్నికల్లో ఎక్కడ పుట్టి ముంచుతారోనని కేడర్‌ సైతం ఆందోళనగా ఉందా? మిత్ర పక్షాల నాయకులు ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా పరిస్థితులు దిగజారాయన్నది నిజమేనా? ఎక్కడుందా పరిస్థితి? అక్కడ కూటమి లెక్కలేంటి? చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి రాజకీయం ఇప్పుడు కాస్త తేడాగా కనిపిస్తోందట. సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసిన మూడు పార్టీలు వైసీపీ కంచుకోటను కొట్టాయి. కానీ…ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి తీరు మారిందా? కథ అడ్డం తిరుగుతోందా అన్న సందేహాలు పెరుగుతున్నాయంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. అందుకు చాలా ఉదాహరణల్నే చూపిస్తున్నాయి. టీడీపీ తరపున ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రాతినిధ్యం వహిస్తుండగా… ఆ పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది జనసేన, బీజేపీ నేతల ఆరోపణ. ఎమ్మెల్యే పులివర్తిపై జనసేన ఇన్‌చార్జ్ దేవర మనోహర్ ఇంతకు ముందు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. అదీకూడా అక్రమ మైనింగ్‌కు సంబంధించి కావడంతో… లోకల్‌గా రెండు పార్టీల నాయకుల మధ్య గ్యాప్‌ బాగా పెరిగిందట. మరోవైపు జాతీయ రహదారి గ్రావెల్ విషయంలో.. టీడీపీ నేతలు డబ్బులు డిమాండ్ చేశారంటూ బీజేపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు బహిరంగంగా ఆరోపించారు. ఇలాంటివన్నీ కలగలిసి కూటమి ఓటు బ్యాంకును దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఆందోళన క్షేత్ర స్థాయిలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జనసేన ఇన్‌చార్జ్ దేవర మనోహర్.. ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. చంద్రగిరి పరిధిలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు దేవర. అధికారిక దర్యాప్తులో నిజానిజాలు తేలాల్సి ఉన్నప్పటికీ, సొంత కూటమి ఎమ్మెల్యేపై మిత్రపక్ష నేత ఏకంగా తమ పార్టీ అధినేతకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అలాగే… నియోజకవర్గంలో జరిగే ఏ ఒక్క అధికారిక కార్యక్రమంలోనూ తమకు కనీస గౌరవం, ప్రాధాన్యం దక్కడం లేదన్నది జనసేన ఇన్ఛార్జ్‌ అసంతృప్తి అట. అగే సమయంలో… జాతీయ రహదారికి గ్రావెల్ సరఫరా వ్యవహారంలో టీడీపీ నేతలు డబ్బులు డిమాండ్ చేశారంటూ బీజేపీ మాజీ ఇన్‌చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు బహిరంగ ఆరోపణలు చేయడంతో…కూటమిలో విభేదాలు రచ్చకెక్కినట్టయింది.

కొన్నాళ్ళ పాటు ఆ వేడి నడిచి తర్వాత వాతావరణం చల్లబడింది. ఈ పరిస్థితుల్లో… ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరగబోతున్న టైంలో… మూడు పార్టీల సమన్వయంపై కొత్త సందేహాలు తలెత్తుతున్నాయట. ఎక్కడో తేడా కొడుతోందన్న మాటలు కింది స్థాయిలో వినిపిస్తున్నాయంటున్నారు. అయితే… జనసేన ఇన్చార్జ్ మనోహర్ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, అలాంటి పనులకు మద్దతు ఇస్తే నాకు చెడ్డ పేరు వస్తుందని, అందుకే పట్టించుకోవడం లేదని చెబుతున్నారట ఎమ్మెల్యే పులివర్తి. ఇక పురుషోత్తం నాయుడు అసలు బీజేపీ నేతే కాదని, ఆ విషయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడే స్వయంగా ప్రకటించారని, వైసీపీ ఆడిన రాజకీయ కుట్రలో భాగంగానే ఆయన తనపై నిందలు వేశారని ఎమ్మెల్యే తన సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలిసింది. మిత్ర పక్షాల నేతలిద్దరి వైఖరిపై ఆయా పార్టీల పెద్దలకు ఎమ్మెల్యే నాని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పరస్పరం ఇంత అపనమ్మకపు పరిస్థితుల్లో… అంతా కలిసి స్థానిక ఎన్నికల్ని సక్సెస్‌ చేయగలరా అన్న సందేహాలు మూడు పార్టీల కేడర్‌లో పెరుగుతున్నాయట. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలు, 98 ఎంపీటీసీలు, 116కు పైగా గ్రామ సర్పంచ్ సీట్లు ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఊళ్ళో టీడీపీ, జనసేన ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుల మధ్య సమన్వయం లేకుంటే… గ్రామస్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరక విభేదాలు భగ్గుమనే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ ఆఫీసుల్లో తమ మాట చెల్లుబాటు కావడం లేదని, ఎమ్మెల్యే కోటరీ మాత్రమే పెత్తనం చేస్తోందన్న ఆవేదనతో ఉన్నారట. ఇటు టీడీపీ కేడర్ మాత్రం.. నియోజకవర్గంలో అసలైన బలం, సంఖ్యాబలం తమకే ఉందని, గతంలో చెవిరెడ్డి కుటుంబాన్ని భరించి, ఎదిరించి పోరాడింది మేమేనని చెబుతూ మిత్రపక్షాలదంతా రాద్ధాంతమేనని అంటున్నట్టు తెలిసింది. ఇలాంటి వాతావరణంలో ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడానికి మిగతా ఇద్దరూ ముందుకు వస్తారా? ఒకవేళ వాళ్లు వచ్చినా ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా స్వాగతిస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ పెద్దలు కొందరు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నా.. లీడర్ల మధ్య ఉన్న ఈగోలు అంత తేలిగ్గా చల్లారేలా కనిపించడం లేదంటున్నారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చంద్రగిరి పంచాయితీని చక్కదిద్దకపోతే.. సీన్ రివర్స్‌ అవుతుందని, వైసీపీకి ప్లస్‌ అవుతుందన్నది కూటమి కేడర్‌ ఆందోళన. ఇలాంటి భిన్న వాతావరణంలో… చంద్రగిరి లోకల్‌ ముఖ చిత్రం ఎలా మారుతుందోనన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.