
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటిదాకా ఏఐ భవిష్యత్తుకు అత్యవసరమనే వాదన గట్టిగా వినిపించగా.. ఇప్పుడు ఏఐ స్పీడందుకుంటే.. మానవాళికే ముప్పనే వాదనకు బలం చేకూరుతోంది. సిలికాన్ వ్యాలీ కూడా ఏఐ విషయంలో రెండుగా చీలిన తరుణంలో.. ఏఐ రాజకీయ బలప్రదర్శనకూ వేదికగా మారుతోంది. ఏఐతో అడ్వాంటేజ్ తీసుకోవాలి బ్రిక్స్ వేదికగా జిన్ పింగ్ చెబితే.. ఏఐ లేకుండా చైనాతో పోటీపడలేమని ట్రంప్ సూత్రీకరిస్తున్నారు. ఇంతకూ ఏఐని ఎలా చూడాలి..? అది మనిషికి ముప్పుగా మారే స్థితిలో ఏం చేయాలి..? మొన్నటిదాకా ప్రపంచ భవిష్యత్తు సాంకేతికగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఏఐ.. ఇప్పుడు మనిషి మనుగడకే ముప్పు తెచ్చే మహమ్మారి అవుతోందనే ఆందోళన పెరుగుతోంది. సాక్షాత్తు ఏఐని అభివృద్ధి చేసిన నిపుణులతో పాటు సాంకేతిక దిగ్గజాలు కూడా ఏై స్పీడ్ తగ్గించాలనే వాదన ఎత్తుకోవడం మరిన్ని భయాల్ని పెంచుతోంది. ఓవైపు దిగ్గజాలు ఏఐతో ముప్పు పొంచి ఉందని తేల్చిచెబుతున్నా.. ట్రంప్ మాత్రం ఏఐ లేకుండా చైనాతో పోటీ పడలేమనే వ్యాఖ్యతో తన వైఖరి ఏంటో కుండబద్దలు కొట్టేశారు.
ఏఐ వల్ల మానవాళికి ఎదురయ్యే ముప్పుపై కొత్త హెచ్చరికలు రావడంతో, ఈ టెక్నాలజీ ఎప్పుడైనా మనుషుల నియంత్రణ దాటి ప్రమాదకరంగా మారుతుందా అనే పాత చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా, ఏఐని తయారు చేస్తున్న కంపెనీలు ఇలాంటి ప్రమాదాలను అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకుంటున్నాయా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. క్లాడ్ ఏఐని తయారు చేస్తున్న ఆంథ్రోపిక్ కంపెనీ సీఈఓ డారియో అమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కంపెనీలు భద్రతా చర్యలకు ఎక్కువ సమయం కేటాయించకపోతే, ఏఐ ఏజెంట్ల గుంపు మరో ఆరు నెలల నుంచి ఏడాది లోపే ఇంటర్నెట్‌పై పట్టు సాధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే చాలా శక్తివంతంగా మారుతున్న ఏఐ మోడల్స్ మనుషులు ఇచ్చే ఆదేశాలు, బాధ్యతాయుతమైన వ్యక్తుల విలువలకు అనుగుణంగానే పనిచేసేలా చూడటానికి కంపెనీలు, ప్రపంచంలోని ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని అమోడీ ఒక ప్రణాళికను వివరించారు. ఈ వ్యాఖ్యలు రావడానికి కొద్ది రోజుల ముందే ఆంథ్రోపిక్‌కు చెందిన ఇద్దరు మాజీ సేఫ్టీ పరిశోధకులు ఏఐ వల్ల మానవాళి ఎదుర్కొనే తీవ్రమైన ప్రమాదాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ఏఐ మోడల్స్ మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ వాటి వల్ల వచ్చే ప్రమాదాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. నేరపూరిత ఉద్దేశాలు ఉన్నవాళ్లు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే అవకాశం ఒక పెద్ద ప్రమాదం. ఉదాహరణకు, ప్రపంచ జనాభాలో ఎక్కువ మందిని చంపగల వ్యాధిని సృష్టించి వ్యాప్తి చేయడానికి ఏఐని ఉపయోగించే ప్రమాదం ఉంది. మరోవైపు, ఏఐ వ్యవస్థలు మనుషుల నియంత్రణ దాటి తమంతట తామే ప్రమాదకర చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంది. ఈ ఆందోళనల్ని పూర్తిగా కొట్టిపారేయటానికీ అవకాశం తక్కువే అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటోంది. అలాగే ఏఐని పూర్తిగా వద్దనకుండా.. మనిషి నియంత్రణలో ఉండేలా.. పరిమిత వేగంతో ఉపయోగించుకోవాలనే సలహాలు వస్తున్నాయి. అంతిమంగా ఏ కొత్త సాంకేతికత అయినా మనిషి మనుగడకు సహాయకారి కావాలే కానీ.. ఆ మనిషి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తే.. మిగిలేది వినాశనమే అంటున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి అన్నది ట్రంప్ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?
ఇక్కడ ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని మాత్రమే అంటున్నాయి. ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్ సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆల్ట్‌మన్ మద్దతు తెలిపారు.
ఆల్ట్‌మన్ చెబుతున్న పేసింగ్ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్ రెండూ ఉండాలన్నమాట. కానీ ట్రంప్ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగినా చైనా ఆగదు అన్నదే ట్రంప్ భయం.
చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, అధునాతన చిప్ టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.
ఆల్ట్‌మన్ మాత్రం ఏఐ విషయంలో రెండు విపత్కర పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్‌మన్ హెచ్చరికల ఆంతర్యం. ఇదే కారణంగా కొందరు ఆంథ్రోపిక్ పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతున్న దశలో.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
మొత్తం మీద అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో చైనాను ఓడించాలి అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ముప్పు. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు. అంతిమంగా ఇది అమెరికా, చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ.
మనుషుల కంటే తెలివైన ఏఐ సూపర్ ఇంటెలిజెంట్ వ్యవస్థలు వచ్చే దశాబ్దంలోనే అందుబాటులోకి వస్తాయని ఎక్కువ మంది నిపుణులు భావిస్తున్నారు. ఏఐ తనను తాను మెరుగుపరుచుకునే స్థాయికి చేరితే మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చనే అభిప్రాయాలున్నాయి. తగిన నియంత్రణ లేకపోతే భవిష్యత్తులో ఏఐని అదుపు చేయడం కష్టమేనని మెజార్టీ నిపుణులు ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇటీవల అమెరికాలో 1,300 మంది ఏఐ రంగ నిపుణులు.. ఏఐ వ్యవస్థలు సమాజానికి ముప్పుగా మారకుండా అంతర్జాతీయ స్థాయిలో భద్రతా నిబంధనలు తీసుకురావాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ప్రయత్నానికి యూఎస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ఏఐ విషయంలో వేగం కంటే భద్రత, బాధ్యతకే పెద్దపీట వేయాలనేది నిపుణుల మాటగా ఉంది.