Reading Time: < 1 minute
Itc Cigarette Price Hike Classic Connect Gold Flake Super Star Gst Excise Duty

Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు ప్రముఖ దిగ్గజ సంస్థ ఐటీసీ (ITC) షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీ (GST) రేటును 40 శాతానికి పెంచడంతో పాటు కొత్తగా అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పన్నుల భారాన్ని తట్టుకునేందుకు ఐటీసీ మరోసారి తన పాపులర్ బ్రాండ్ల ధరలను సవరించింది. డీలర్ల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్త ధరలతో కూడిన సిగరెట్ ప్యాకెట్లు ఇప్పటికే రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా క్లాసిక్ కనెక్ట్ (Classic Connect), గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ (Gold Flake Super Star) బ్రాండ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. 20 సిగరెట్లు ఉండే క్లాసిక్ కనెక్ట్ ప్యాకెట్ ధర ఇంతకుముందు రూ. 390 ఉండగా, ఇప్పుడు ఏకంగా 9.74 శాతం పెరిగి రూ. 428కి చేరింది. అలాగే 10 సిగరెట్లు ఉండే గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ప్యాకెట్ రూ. 79 నుంచి ఏకంగా 12.66 శాతం పెరిగి రూ. 89కి చేరింది.

పన్నుల భారం నుంచి బయటపడేందుకు ఐటీసీ ధరలు పెంచడం ఇది మొదటిసారేమీ కాదు. ఈ ఏడాది ప్రారంభంలో పన్నుల విధానం మారిన వెంటనే క్లాసిక్ కనెక్ట్ ధర రూ. 300 నుంచి రూ. 360కి, ఆ తర్వాత రూ. 390కి పెరిగింది. గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ధర కూడా రూ. 59 నుంచి మొదట రూ. 70కి చేరింది. ఆ తర్వాత మే నెలలో రెండో దఫా పెంపులో భాగంగా ఈ గోల్డ్ ఫ్లేక్ ప్యాకెట్ ధరను రూ. 70 నుంచి రూ. 79కి పెంచారు. ఇప్పుడు దాన్ని మరింత పెంచి రూ. 89కి తీసుకెళ్లారు. పన్నుల రేట్లు మారినప్పటి నుంచి ఐటీసీ వరుసగా ధరలను సమీక్షిస్తూ వినియోగదారులపై భారం మోపుతుండటంతో, రాబోయే రోజుల్లో సిగరెట్ల విక్రయాల పరిమాణం (సేల్స్ వాల్యూమ్స్) తగ్గే అవకాశం ఉందంటూ ప్రముఖ రేటింగ్ సంస్థ నోమురా (Nomura) హెచ్చరించింది.