
మీ ఫోన్ ఒక్కసారిగా వేడెక్కుతోందా? ఛార్జింగ్ కేబుల్ సరిగ్గా పనిచేయడం లేదా? స్క్రీన్‌పై చిన్న పగులు వచ్చినా టచ్ మాత్రం పనిచేస్తోందని వాడుతున్నారా? ఇలాంటి సమస్యలను తేలిగ్గా తీసుకుంటే తర్వాత మరమ్మతులకు భారీ మొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో భద్రతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.
వెంటనే కారణం తెలుసుకోండి..
గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఛార్జింగ్ సమయంలో కొంత వేడి రావడం సాధారణమే. కానీ ఎలాంటి పని చేయకపోయినా ఫోన్ విపరీతంగా వేడెక్కుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బ్యాటరీ లేదా ప్రాసెసర్‌లో సమస్యకు ఇది సంకేతం కావచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న అవసరం లేని యాప్‌లను మూసివేయాలి. నాణ్యత లేని ఛార్జర్‌లను ఉపయోగించకపోవడం మంచిది. బ్యాటరీ ఒక్కసారిగా త్వరగా ఖాళీ అవుతున్నా జాగ్రత్త. ముఖ్యంగా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలి. ఉబ్బిన బ్యాటరీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున స్వయంగా మార్చే ప్రయత్నం చేయకుండా అధీకృత సేవా కేంద్రాన్ని సంప్రదించడం మంచిది.
చిన్న సమస్య పెద్ద నష్టం..
ఛార్జింగ్ కేబుల్ కాస్త కదిలినా ఛార్జింగ్ ఆగిపోతుంటే కేబుల్ సమస్యే అనుకోవద్దు. ఛార్జింగ్ పోర్టులో ధూళి పేరుకుపోయినా ఇలాంటి సమస్య రావచ్చు. శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బలంగా వస్తువులు పెట్టడం వల్ల పోర్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. స్క్రీన్‌పై చిన్న పగులు వచ్చినా అలాగే వాడటం మంచిది కాదు. ఆ పగుళ్ల ద్వారా నీరు, చెమట లోపలికి చేరి డిస్‌ప్లేతో పాటు లోపలి భాగాలను దెబ్బతీయొచ్చు.
ఫోన్ తరచూ ఆగిపోవడం, నెమ్మదించడం కూడా నిల్వ స్థలం నిండిపోవడం వల్ల కావచ్చు. అనవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను తొలగించి ఖాళీ స్థలాన్ని ఉంచాలి. చిన్న సమస్య కనిపించినప్పుడే స్పందిస్తే పెద్ద మరమ్మతు ఖర్చును తప్పించుకోవచ్చు. ఫోన్ ఇస్తున్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.