
22ఏ పేరుతో ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిందని, ప్రభుత్వ బాధ్యతలను విపక్షాలు గుర్తు చేయాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. రైతులు, పేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై చర్చ జరుగుతుందనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి పారిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
సభ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను గత ప్రభుత్వమే రూపొందించిందని సీఎం గుర్తుచేశారు. కొందరు ప్రజాప్రతినిధులు వికృతంగా ప్రవర్తించారని, సభ్య సమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందని వ్యాఖ్యానించారు.సభలోకి నల్ల దుస్తులతో రావద్దనే నిబంధనను గత ప్రభుత్వమే పెట్టిందని, స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను గేట్ నంబర్ 3 వద్ద పోలీసులు అమలు చేశారని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ నిబంధనల ప్రకారమే రాహుల్ గాంధీ నిరసన తెలిపారని పేర్కొన్నారు.
మహిళలను కించపరిచేలా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారని, బీఆర్ఎస్ సభ్యులు విచక్షణ కోల్పోయి అహంకారంతో వ్యవహరించారని సీఎం ఆరోపించారు. సభ వెలుపల పోలీసులపై, సభలో స్పీకర్‌పై దాడికి పాల్పడ్డారని పేర్కొంటూ, బాధ్యతారహితంగా ప్రవర్తించిన కారణంగానే సభ్యులను సస్పెండ్ చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.