కావలసిన పదార్థాలు: 200 గ్రాములు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన పొన్నగంటి ఆకు, 2 నుండి 3 టీస్పూన్ల నూనె, పావు టీస్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 4 ఎండుమిరపకాయలు, ముక్కలుగా కట్ చేసిన 6 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టినది, తాలింపు గింజలు, చిటికెడు ఇంగువ
తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్లో ఒక టీస్పూన్ నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. ఇవి కాస్త వేగాక 2-3 స్పూన్ల తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు మాడకుండా వేపాలి. ఆపై కట్ చేసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చిమిర్చి మెత్తబడే వరకు చిన్న మంటపై వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
అదే పాన్లో కొద్దిగా నూనె వేసి, శుభ్రం చేసి పెట్టుకున్న 200 గ్రాముల పొన్నగంటి ఆకును వేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. మూతపెడుతూ మధ్యమధ్యలో కలుపుతూ ఆకులోని పచ్చివాసన పోయి మెత్తగా అయ్యే వరకు లో-మీడియం మంటపై మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
రోట్లో లేదా మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు, మిరపకాయల మిశ్రమాన్ని వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. చివరగా మగ్గించి చల్లార్చిన పొన్నగంటి ఆకును వేసి మొత్తం సమంగా కలిసేలా రోటి పచ్చడిలా బరకగా దంచుకోవాలి.
నూరిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న బాండీలో నూనె వేడిచేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేయించాలి. చివరగా కరివేపాకు, ఘుమఘుమలాడే ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి, ఈ తాలింపును పచ్చడిలో వేసి బాగా కలపాలి. అంతే, నోరూరించే ఔషధ గుణాల పొన్నగంటి ఆకు రోటి పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే అమృతంలా ఉంటుంది!




