Reading Time: 2 minutes

భద్రాద్రికొత్తగూడెం: ఐసీడీఎస్‌‌‌‌లో ‘కమీషన్ల’ లొల్లి?..సాక్షం నిధుల వినియోగంపై ఆరోపణలు..

Caption of Image.
  •     టెండర్లు లేకుండానే పెయింటింగ్ పనుల కేటాయింపు?
  •     తమ వాళ్లకే అంగన్​వాడీ సెంటర్లలో పెయింటింగ్​ వర్క్స్​ 
  •     క్వాలిటీ లెస్, అసంపూర్తి వర్క్స్​పై టీచర్ల అసంతృప్తి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తుండగా, వాటి నిధుల వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ పరిధిలో సాక్షం పథకం కింద విడుదలైన నిధుల వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో పెయింటింగ్ పనులతో పాటు స్టీల్ వాటర్ ఫిల్టర్ల కొనుగోళ్లలో కమీషన్ల బేరాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 

జిల్లా వ్యాప్తంగా 2022-–23లో సాక్షం పథకం కింద 350 అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా కేంద్రాల్లో పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దశల వారీగా నిధులు విడుదల చేశారు. ఒక్కో కేంద్రానికి ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు రూ.10 వేలు, రెయిన్‌‌‌‌వాటర్ హార్వెస్టింగ్‌‌‌‌కు రూ.16 వేలు, పోషణ్ వాటికకు రూ.10 వేలు, ఇతర మౌలిక వసతుల కోసం రూ.20 వేల చొప్పున నిధులు కేటాయించారు. మొత్తంగా జిల్లాకు సుమారు రూ.1.96 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలకు అవసరమైన ఎల్‌‌‌‌ఈడీ టీవీలను ఐసీడీఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచే కొనుగోలు చేసి పంపింది. మిగిలిన విభాగాలకు అవసరమైన సామగ్రిని జిల్లా స్థాయిలో కోటేషన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోళ్లలో కమీషన్ల బేరాలు జరిగాయనే ఆరోపణలు ఐసీడీఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఆర్వో ప్లాంట్లకు బదులు స్టీల్ ఫిల్టర్లు..

అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు సాక్షం పథకం కింద ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కొన్ని కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, వాటర్ ట్యాంకులు అందుబాటులో లేకపోవడంతో స్టీల్ వాటర్ ఫిల్టర్లను కొనుగోలు చేశారు. ఈ స్టీల్ వాటర్ ఫిల్టర్ల కొనుగోళ్లలో పెద్దఎత్తున కమీషన్ల బేరాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఫిల్టర్‌‌‌‌పై సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు కమీషన్ బేరం కుదిరిందని పలువురు ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌‌‌‌వాడీ టీచర్లు పేర్కొంటున్నట్లు సమాచారం.

రూ.22.75 లక్షలతో పెయింటింగ్ పనులు..

ఆర్వో ప్లాంట్లకు బదులుగా స్టీల్ వాటర్ ఫిల్టర్లు కొనుగోలు చేయగా మిగిలిన సుమారు రూ.22.75 లక్షల నిధులతో జిల్లాలోని 70 అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో పెయింటింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. పిల్లలను ఆకట్టుకునేలా కేంద్రాల్లోని గోడలపై బొమ్మలు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 70 కేంద్రాల్లో సుమారు రూ.22.75 లక్షలతో పెయింటింగ్ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవాల్సి ఉండగా, నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించారు. ఇందుకోసం మూడు, నాలుగు కోటేషన్లు సేకరించి, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి తక్కువ కోటేషన్ వచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, సాక్షం పథకం కింద ఎంపికైన 350 అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల్లో 70 కేంద్రాల్లో పెయింటింగ్ పనులు చేపట్టేందుకు ఎంపిక చేసిన విధానంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయా కేంద్రాలను పర్యవేక్షించే సీడీపీఓలు, సూపర్‌‌‌‌వైజర్లకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. పెయింటర్లు కేంద్రాలకు వచ్చే వరకు పలువురు అంగన్‌‌‌‌వాడీ టీచర్లు, సీడీపీవోలు, సూపర్‌‌‌‌వైజర్లకు ఈ పనులపై సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఖాళీ ప్రొఫార్మాలపై సంతకాలు?

పెయింటింగ్ పనులు పూర్తయిన అనంతరం అంగన్‌‌‌‌వాడీ టీచర్లతో ఖాళీ ప్రొఫార్మాలపై సంతకాలు చేయించుకోవడంతో కొంతమంది టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రొఫార్మాల్లో పనుల మొత్తం అమౌంట్​ వంటి వివరాలు నమోదు చేయకుండానే తమతో సంతకాలు చేయించుకున్నారని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు. పీడీ పేరు చెప్పడంతోనే తాము సంతకాలు చేశామని వారు చెబుతున్నారు. మరోవైపు చేపట్టిన పెయింటింగ్ పనుల్లో నాణ్యత లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల మొత్తం భవనానికి పెయింటింగ్ వేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల లోపలి గది, వరండా, ఎంట్రన్స్​కే పనులు పరిమితమయ్యాయని, మిగిలిన గోడలు బోసిగా కనిపిస్తున్నాయని టీచర్లు పేర్కొంటున్నారు. పెయింటింగ్ పనులను టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఎందుకు కేటాయించారనే ప్రశ్నపై ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వర్ణలత స్పందిస్తూ పనులు చేయించాల్సిన అవసరం ఉందని, టెండర్ లేదా నామినేషన్ ఏ పద్ధతిలో చేసినా పనులు పూర్తవ్వాల్సిందే అన్నట్లుగా సమాధానం ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.