
- చెన్నూరులో రూ.70 కోట్లతో పనులు:
- పెద్ద చెరువు, శివ్వారం మొసళ్ల మడుగును
- టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దుతం
- చెన్నూరులో పుష్కరఘాట్
- నిర్మాణ పనులకు భూమిపూజ
కోల్బెల్ట్/చెన్నూరు, వెలుగు: వచ్చే ఏడాది జులైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ నిధులతో ఆలయాల అభివృద్ధితో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. సోమ, మంగళవారాల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. మందమర్రి మార్కెట్, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీ ఆఫీసుతో పాటు జైపూర్, భీమారం, కోటపల్లి మండలాల్లో సింగరేణి మందమర్రి ఏరియా జీఎం ఎన్రాధాకృష్ణ, లీడర్లతో కలిసి గణేశ్ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
చెన్నూరులో గోదావరి నది వద్ద రూ.8 కోట్లతో చేపట్టనున్న పుష్కర ఘాట్ నిర్మాణానికి, రూ.50 లక్షలతో గోదావరి రోడ్డులో హనుమాన్ టెంపుల్లో మండపం నిర్మాణం, బొక్కలగుట్టలో రూ.50 లక్షలతో గౌడ సంఘం భవన నిర్మాణానికి మంచిర్యాల కలెక్టర్కుమార్దీపక్తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెన్నూరులో రూ.70 కోట్లతో గోదావరి పుష్కరాల కోసం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. పుష్కరాలకు దాదాపు లక్షమంది భక్తులు వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌలతులు కల్పిస్తామన్నారు. పుష్కరాల నాటికి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇప్పటికే కాళేశ్వరం, ధర్మపురి, బాసర, భద్రాచలం, కోటిలింగాలతోపాటు చెన్నూరు అంబ అగస్తేశ్వర ఆలయాల పునర్నిర్మాణ పనులు ప్రారంభించినట్టు చెప్పారు. గోదావరి రోడ్డుతో పాటు చెన్నూరు పట్టణంలోనూ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
రూ.17 కోట్లతో చెన్నూరు పెద్దచెరువులోని శివాలయ ప్రాంతాన్ని , శివ్వారం గోదావరి మొసళ్ల మడుగును డెవలప్చేస్తామని, ఈ ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా మారుస్తామన్నారు. రూ.5.50 కోట్లతో చెన్నూరులో చేపట్టిన రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరిస్తున్నారని, షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులకు కొత్త షాపులు కేటాయిస్తామని చెప్పారు. రూ.30 కోట్లతో అమృత్ స్కీం 2.0 కింద డ్రింకింగ్ వాటర్ సప్లై పనులు నడుస్తున్నాయన్నారు. అక్టోబర్లో చెన్నూరులో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు.
కేసీఆర్దళిత వ్యతిరేకి
తెలంగాణకు దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే సీఎం పీఠమెక్కి మోసం చేశాడని, ఆయన దళిత వ్యతిరేకి అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీఆర్ఎస్హయాంలో దళిత కౌలుదారులకు రైతుబంధు ఇవ్వాలని తాను కోరితే తిరస్కరించారని గుర్తుచేశారు. దళితులు డప్పులు కొట్టి నిరసన తెలిపిన ప్రాంతాన్ని పుసుపు నీళ్లతో శుద్ధి చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో దళితులే రాజకీయంగా బీఆర్ఎస్ను శుద్ధి చేస్తారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
ఇది కేవలం ఒక్క కూలానికి జరిగిన అవమానం కాదని.. రాజ్యాంగానికి, అసెంబ్లీ గౌరవానికి అవమానమన్నారు. స్పీకర్పట్ల ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వాఖ్యలపై కేసీఆర్క్షమాపణ కోరాల్సిందన్నారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని, తమను ఎదుర్కొనే సత్తాలేక అసెంబ్లీ ముందు అల్లర్లు సృష్టించిందన్నారు. సబ్బండవర్గాలు, కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో తెలంగాణ ఏర్పడిందని, పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదని, కేసీఆర్ తనకు, కొడుకు, అల్లుడికి వందల ఎకరాల్లో ఫాంహౌస్లు కట్టించిండన్నారు. నిషేదిత జాబితాలో పెట్టి కేసీఆర్ కుటుంబం రంగారెడ్డి, హైదారాబాద్ చుట్టు పక్కల 30 వేల ఎకరాలు దక్కించుకుందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారని.. కాంగ్రెస్ 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించిందని, మరో రెండు లక్షలు కట్టించబోతుందని మంత్రి వివరించారు.
ఎల్నినోతో ఇబ్బందులు
ఎల్నినో ప్రభావంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, తెలంగాణలోనూ తక్కువ వర్షాలు కురిశాయని మంత్రి వివేక్ పేర్కొన్నారు. జపాన్, కొరియా దేశాల్లో తన పర్యటన సందర్భంగా ఎల్నినో ప్రభావం చూశానని, అక్కడ ఉష్టోగ్రతలు 50 డిగ్రీలుదాటాయన్నారు. తక్కువ వర్షాల కారణంగా తెలంగాణలో రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండలేదన్నారు. దీని వల్ల వచ్చే వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పవన్నారు. మంత్రి వెంట చెన్నూరు మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్ కమిషనర్లు రాజలింగు, మురళీకృష్ణ, మారుతీ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ విష్ణు, డీఈ దామోదర్, డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.