
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌లపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వివిధ వర్గీకరణల కింద ఉన్న మొత్తం 9,09,000 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషిద్ధం తొలగిపోయింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా 1,36,000 ఎకరాల గ్రామ సేవ ఇనాం భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఈ పరిణామం రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించనుంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసిన 3,63,000 ఎకరాలపై మాత్రం రిజిస్ట్రేషన్ నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో ఏపీ అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేశారు. అయితే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అసైన్ చేయకపోయినా, వాటిని పేదలకు ఇచ్చినట్లు చూపించి దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, అక్రమ ప్రాసెసింగ్, తప్పుడు వర్గీకరణలు, నిషేధిత ఆస్తులను జాబితాలో చేర్చడం వంటి అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీంతో, కూటమి ప్రభుత్వం ఈ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ల ద్వారా పరిశీలన చేయించాలని నిర్ణయించింది. తాత్కాలిక చర్యగా, ఫ్రీహోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ 2024 ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత, రెవెన్యూ మంత్రి అధ్యక్షతన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం పలు దఫాలుగా సమావేశమై ప్రభుత్వానికి సిఫార్సులు అందించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం, నిబంధనలకు అనుగుణంగా ఉన్న భూములపై రిజిస్ట్రేషన్ నిషేధాన్ని తొలగించింది.
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా ఫ్రీహోల్డ్ చేసిన 7,85,000 ఎకరాలను రిజిస్ట్రేషన్లకు తక్షణమే అనుమతిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ జరిగిన 16,801 ఎకరాలపై కూడా లావాదేవీలు చేసుకోవచ్చు. పొరపాటున ఫ్రీహోల్డ్ చేసిన 5,422 ఎకరాల ప్రైవేటు భూములను ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీహోల్డ్‌కు అర్హత ఉన్నప్పటికీ అధికారిక ప్రొసీడింగ్స్ ఇవ్వని 64,143 ఎకరాలను కూడా రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారు. 17,897 ఎకరాల చుక్కల భూములను రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్‌మెంట్ విస్తీర్ణం కంటే అదనంగా ఫ్రీహోల్డ్ చేసిన 11,749 ఎకరాల విషయంలో, రీసర్వే చేసిన గ్రామాల్లో అయితే ఎల్‌పీఎంపీలో నమోదైన విస్తీర్ణాన్ని, రీసర్వే పూర్తి కాని గ్రామాల్లో వెబ్ ల్యాండ్ అడంగల్‌లో నమోదైన విస్తీర్ణాన్ని ఫ్రీహోల్డ్‌గా పరిగణించాలి. అయితే, కొన్ని రకాల భూములపై రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఫ్రీహోల్డ్ చేసిన 38,733 ఎకరాల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేస్తారు. వీటిని ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్లు సమగ్రంగా పరిశీలించి చర్యలు చేపడతారు. అసైన్డ్ భూములు పొందిన వారు లేదా వారి వారసుల స్వాధీనంలో లేని 25,486 ఎకరాల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తారు. వీటిపైనా ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. వెబ్ ల్యాండ్‌లో అసైన్డ్ అని చూపిస్తున్నా, అసైన్‌మెంట్ ఆధారాలు లేని 2,87,153 ఎకరాల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేసి, పరిశీలన తర్వాత ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తారు. నీటి మార్గాలు, నీటి వనరుల పోరంబోకులు కానీ 24,261 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌లను అనుమతిస్తారు, కానీ నీటిమార్గం, నీటివనరుల పోరంబోకు వర్గీకరణలో ఉన్న 3,517 ఎకరాల రిజిస్ట్రేషన్లపై నిషేధం కొనసాగుతుంది. అసైన్‌మెంట్ చేసి 20 ఏళ్లు నిండని 28,292 ఎకరాల భూములను 20 సంవత్సరాలు పూర్తయ్యాక రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లేకున్నా ఇప్పటికే 8,483 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి రిజిస్ట్రేషన్లను నిలిపివేసి, జిల్లా కలెక్టర్లు సమగ్ర పరిశీలన చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. గ్రామ సేవ ఇనాం భూములు 1,36,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తారు. పేదలకు కేటాయించిన మిగులు భూములను అసైన్డ్ భూములుగా పరిగణించి, వాటికి కేటగిరీల వారీగా ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. భవిష్యత్తులో ఏదైనా భూమిని ఫ్రీహోల్డ్ చేయాలంటే, అసైన్ దారులు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయాలి. ఇది ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్‌కు చేరుతుంది. ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరు, ప్రొసీడింగ్స్, నిషేధిత జాబితాల నుంచి తొలగింపు వంటి అధికారాలు ఆర్డీఓ, సబ్ కలెక్టర్లకే ఉంటాయి. నగరపాలక సంస్థల పరిధిలో ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ ఉత్తర్వులపై 60 రోజుల్లోపు సంయుక్త కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై 90 రోజుల్లోపు ప్రభుత్వం ముందు రివిజన్ దరఖాస్తు చేయొచ్చు.
కలెక్టర్ ద్వారా వర్గీకరణ మార్చి అసైన్ చేసిన భూములను అర్హతకు అనుగుణంగా 22ఏ జాబితా నుంచి తొలగించి, వాటినే ఫ్రీహోల్డ్‌గా మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నీటివనరులకు సంబంధించిన భూముల వర్గీకరణ మార్చకూడదు. భూమి లేని పేదలకు కేటాయించిన మిగులు భూములు కూడా ఫ్రీహోల్డ్ హక్కుల పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫ్రీహోల్డ్ చేసిన భూముల వర్గీకరణలపై చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) నాలుగు వారాల్లో ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డుల్లో సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం ఆదేశించిన భూములను వెబ్ ల్యాండ్ సహా ఆన్‌లైన్ సిస్టమ్‌లలో కనిపించేలా చూడాలి. సంబంధిత భూమి రిజిస్ట్రేషన్ చేయదగ్గ కేటగిరీలోకి వస్తుందో లేదో సబ్ రిజిస్ట్రార్లు నిర్ధారించుకునేలా ఏపీఐ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. అందులో కేటగిరీలు, జిల్లాల వర్గీకరణను పొందుపరిచి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీకి తెలియజేయాలని ఆదేశించింది. ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన చేపట్టిన తర్వాత కొందరు తహసీల్దార్లు వాటిని ఫ్రీహోల్డ్ జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వాటిని మళ్లీ ఫ్రీహోల్డ్ జాబితాలోకి పునరుద్ధరించాలని ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఏపీఐ ఉపయోగించాలని, ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లలో మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించింది. రెగ్యులర్ డాక్యుమెంట్ నెంబర్ కేటాయించేటప్పుడు రిజిస్ట్రేషన్ల సమయంలో రెవెన్యూ శాఖ తాజా వెబ్ ల్యాండ్ ఏపీఐ ఉపయోగించాలి. అందులో సర్వే నెంబర్ వివరాలు ధ్రువీకరిస్తే రిజిస్ట్రేషన్‌కు అనుమతించొచ్చని, ధ్రువీకరించకపోతే రిజిస్ట్రేషన్ తిరస్కరించి, సంబంధిత అధికారిని సంప్రదించాలని సూచించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.