Reading Time: 2 minutes

దిశా సాలియన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రధాని మోడీ, ట్రంప్ పేర్లను లాగిన ఉద్ధవ్ ఠాక్రే

Caption of Image.

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ కేసుపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుతో తనకు కానీ, తన కుమారుడు ఆదిత్య ఠాక్రేకు కానీ ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. 

ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని పేర్కొన్న ఆయన.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమ కుటుంబంపై  బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తమ పేర్లను దురుద్దేశపూర్వకంగా లాగుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసులో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. 

సంబంధం లేని వారిని ఇరికించాలనుకుంటే ఎవరి పేర్లయినా చేర్చవచ్చని పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండటం వల్లే తాము మౌనంగా ఉన్నామన్నారు. కేసు దర్యాప్తుకు పూర్తి సహకరిస్తామని తెలిపారు. అయితే, కేసు విచారణ సమయంలోనే తమ కుటుంబ వ్యక్తిత్వ హననం ఆపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

అసలేం జరిగింది..?

2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ నివాస భవనం నుంచి దిశా సాలియన్ కిందపడిపోయి మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటనను యాక్సిడెంటల్ డెత్గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఆమె మృతి, ఆరు రోజుల అనంతరం సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కావడంతో ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో, మీడియాలో అనేక రకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ రెండు మరణాల మధ్య సంబంధం ఉన్నట్లు నిర్ధారించే అధికారిక ఆధారం బయటకు రాలేదు.

దిశా తండ్రి సతీశ్ సాలియన్ మాత్రం తన కుమార్తె మరణం వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆరోపిస్తూ, కేసును మళ్లీ లోతుగా దర్యాప్తు చేయాలని కోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలతో పాటు, ఈ కేసులో ప్రభావవంతమైన వ్యక్తుల పాత్రపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే.. CBI దర్యాప్తులో అవి నిజమా కాదా తేలాల్సి ఉంది.

బాంబే హైకోర్టు ఎందుకు CBI దర్యాప్తుకు ఆదేశించింది..?

2026 సెప్టెంబర్ 2న బాంబే హైకోర్టు ఈ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది. గతంలో జరిగిన పోలీసుల దర్యాప్తు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయిందని, కొన్ని అంశాల్లో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. అందుకే ఈ కేసులో CBI దర్యాప్తు అవసరమని నిర్ణయించింది.

►ALSO READ | కొండచిలువను మింగేసిన 12 అడుగుల నాగుపాము…! ఆ తర్వాత ఏమైందంటే..!

కేసుకు సంబంధించి FIR నమోదు చేయడంతో పాటు, దిశా తండ్రి సతీశ్ సాలియన్ స్టేట్మెంట్ను నమోదు చేయాలని, సీనియర్ మరియు అనుభవజ్ఞుడైన అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని CBIని ఆదేశించింది. అదే సమయంలో.. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది..

CBI ముందు తండ్రి కీలక స్టేట్మెంట్

హైకోర్టు ఆదేశాల తర్వాత సెప్టెంబర్ 11న దిశా తండ్రి సతీశ్ సాలియన్ CBI అధికారుల ముందు తన స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు తెలిసిన వివరాలతో పాటు, కేసుతో సంబంధం ఉందని తాను భావిస్తున్న పలువురి పేర్లను అధికారులకు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. మీడియా కథనాల ప్రకారం, ఆయన పేర్కొన్న పేర్లలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, నటులు రియా చక్రవర్తి, డినో మోరియా, సూరజ్ పంచోలి తదితరులు ఉన్నారు. 

కొంతమంది బాడీగార్డులు, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే సహా పలువురు తన కుమార్తె మరణం వెనుక ఉన్న వాస్తవాలను కప్పిపుచ్చడంలో, అలాగే జరిగినట్లు ఆరోపిస్తున్న కుట్రలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నట్లు ఐఏఎన్ఎస్ నివేదించింది.

©️ VIL Media Pvt Ltd.