Reading Time: 2 minutes

బిగ్‌బాస్ వేదికగా పొలిటికల్ రగడ.. సీఎం విజయ్‌ను విజయ్ సేతుపతి టార్గెట్ చేశారా? ఫ్యాన్స్ వార్ షురూ!

Caption of Image.

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తమిళ సీజన్ 10 ‘ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోకు హోస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి చేస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌లో జరిగిన ఓ సీన్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. విజయ్ సేతుపతి తన శైలిలో వేసిన ఒక్క డైలాగ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హౌస్‌లో జరిగిన ఓ చిన్న చర్చ, ఏకంగా సీఎం విజయ్ వర్సెస్ విజయ్ సేతుపతి వార్‌గా మారి కూర్చుంది.

అసలు మ్యాటర్ ఏంటంటే..?

తమిళ బిగ్‌బాస్‌లో ఈసారి ‘డెమోక్రసీ రూమ్’.. అనే ఎన్నికల థీమ్ తో అసెంబ్లీ తరహా టాస్క్‌లతో  కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. ఇందులో హౌస్‌మేట్ సతిగా గెలుపు కోసం బోలెడు హామీలిచ్చి కెప్టెన్ అయ్యారు. తీరా గెలిచాక ఆ వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో ఈ వ్యవహారంపై క్లాస్ పీకిన విజయ్ సేతుపతి, ఆలోచించకుండా హామీలు ఇవ్వడం, సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం, దానికి ప్రతిపక్షాలను నిందించడం నిజమైన నాయకత్వం అనిపించుకోదు అని గట్టిగానే ఇచ్చిపడేశారు.

ఫ్యాన్స్ వార్..

ఈ మాటలు హౌస్ పరిధిలోనే ఉన్నప్పటికీ, నెటిజన్లు మాత్రం దీనిని తమిళనాడు సీఎం విజయ్ పెట్టిన కొత్త పార్టీ, ఆయన రాజకీయ వైఖరికి ముడిపెట్టేశారు. సేతుపతి వ్యాఖ్యలు విజయ్‌ని టార్గెట్ చేస్తూ చేసినవేనంటూ దళపతి ఫ్యాన్స్ విరుచుకుపడటంతో సోషల్ మీడియాలో సేతుపతి వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ వార్ మొదలైంది. తీవ్రతను గ్రహించిన విజయ్ టీవీ వెంటనే స్పందిస్తూ.. ఇది కేవలం ఒక వినోద కార్యక్రమం. హౌస్‌లోని గేమ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే తప్ప బయటి వ్యక్తులకు లేదా వ్యవస్థలకు ఎలాంటి సంబంధం లేదు అని అధికారికంగా స్పష్టత ఇచ్చింది.

మరోవైపు, సేతుపతి అభిమానులు ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. విజయ్‌ని సేతుపతి ఎప్పుడూ ‘అన్నా’ అని పిలుస్తారని, ‘మాస్టర్’ సినిమా సమయంలో ఆయనపై చూపించిన ప్రేమాభిమానాలను గుర్తు చేస్తున్నారు. ఎలాంటి పొలిటికల్ ఉద్దేశం లేకుండా హౌస్‌మేట్‌కు ఇచ్చిన సలహాను అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని స్పష్టం చేస్తున్నారు. కారణం ఏదైనా, సేతుపతి పవర్ ఫుల్ కామెంట్స్ మాత్రం బిగ్‌బాస్ రేటింగ్స్‌ను ఓ రేంజ్‌లో పెంచేశాయి.

 

©️ VIL Media Pvt Ltd.