Telangana: అయ్య బాబోయ్.. నూనెను కూడా వదిలిపెట్టరా..? రోడ్డుపై జనం ప్రాకులాట..

రోడ్డుపై డబ్బులు పడితే జనం ఎగబడటం చూశాం… బియ్యం చెల్లాచెదురైతే ఏరుకోవడం చూశాం.. అలాగే రోడ్డుపై పారిన వంట నూనె కోసం బాటిళ్లు, డబ్బాలు పట్టుకుని జనం పరుగులు తీశారు. క్షణాల్లో రోడ్డంతా జనంతో నిండిపోయింది. ఎవరి చేతిలో వారికి దొరికిన పాత్ర… అందులో నూనె నింపుకునేందుకు పోటీ పడ్డారు. ఈ ఆసక్తికరమైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సూర్యాపేట జిల్లా కోదాడలో సంతోషిమాత ఆయిల్ డిపో నుండి ప్రతిరోజు పట్టణంలోని వివిధ షాపులకు వంట నూనె సప్లై చేస్తుంటారు. రోజు మాదిరిగానే రిక్షా పుల్లర్.. 20 వంటనూనె డబ్బాలను వివిధ దుకాణాలకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో ఒక్కసారిగా రిక్షా టైరు పంక్చర్ అయింది. దీంతో రిక్షాపై ఉన్న ఆయిల్ డబ్బాలు ఒక్కసారిగా కింద పడిపోయాయి. డబ్బాలు పగిలి పోవడంతో వంటనూనె రోడ్డంతా పారిపోయింది. రోడ్డుపై వంటనూనె పారుతుండటాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు ఖాళీ బాటిళ్లు, డబ్బాలతో నూనెను తమ పాత్రల్లో నింపుకున్నారు. క్షణాల్లో రోడ్డంతా జనంతో నిండిపోయింది. ఫ్రీ ఆయిల్” కోసం జనం బాటిళ్లతో పరుగులు తీశారు. చేతికి అందిన బాటిళ్లలో డస్టర్లు సహాయంతో రోడ్డుపై నూనెను పట్టుకెళ్ళారు. సమాచారం అందుకున్న షాప్ యజమాని.. వెంటనే తన గుమస్తాలతో రోడ్డుపై మిగిలిన నూనెను తిరిగి డబ్బాల్లోకి సేకరించి తరలించారు. అయితే రోడ్డుపై పడిన నూనె కారణంగా కొంతసేపు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.