July 8, 2026

IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!

IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
Reading Time: < 1 minute
Rcb Players Ignored For Zimbabwe Tour Failure Mayank Yadav Gets India Call Up

India Squad Selection Debate: జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో కొన్ని ఎంపికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున రాణించిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఐపీఎల్‌లో పెద్దగా రాణించని ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు చోటు దక్కలేదు. పాటిదార్ 2026 ఐపీఎల్ సీజన్‌లో 501 పరుగులు చేశాడు. అతను 41.75 బ్యాటింగ్ సగటు, 192.69 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. అలాగే టోర్నమెంట్లో 42 సిక్సర్లు బాదాడు. సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, యువ పేసర్ రసిఖ్ సలామ్‌లకు కూడా ఛాన్స్ రాలేదు. కృనాల్ 45.0 సగటుతో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. రసిఖ్ 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. 21.32 సగటు, 9.46 ఎకానమీ రేటుతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌కు భారత జట్టులో అవకాశం లభించింది. ఐపీఎల్ 2026లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున 4 మ్యాచ్‌లలో ఆడినప్పటికీ.. ఒక్క వికెట్ పడగొట్టలేదు. సుమారు 12 ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లను బీసీసీఐ పక్కన పెడుతోంది అని అంటున్నారు. మయాంక్ యాదవ్‌కు ఏ ప్రాతిపదికన చోటు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.