July 8, 2026

14 ఏళ్ల కుర్రాడి సూపర్ ఆలోచన.. బెంగళూరు ఫుట్‌పాత్‌లను కాపాడేందుకు ‘Raste’ యాప్!

14 ఏళ్ల కుర్రాడి సూపర్ ఆలోచన.. బెంగళూరు ఫుట్‌పాత్‌లను కాపాడేందుకు ‘Raste’ యాప్!
Reading Time: 2 minutes

14 ఏళ్ల కుర్రాడి సూపర్ ఆలోచన.. బెంగళూరు ఫుట్‌పాత్‌లను కాపాడేందుకు ‘Raste’ యాప్!

Caption of Image.

బెంగళూరు నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, నడిచే వారికి ఎదురయ్యే ఇబ్బందులను గమనించిన ఓ 14 ఏళ్ల విద్యార్థి.. సమస్యను కేవలం మాటలకు వదిలేయకుండా టెక్నాలజీతో పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాడు. బెంగళూరుకు చెందిన సూర్య ఉత్కర్ష రూపొందించిన ‘రాస్తే (Raste)’ యాప్ ఇప్పుడు నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణల గురించి జనం నేరుగా స్పందించే శక్తివంతమైన వేదికగా మారుతోంది. చిన్న వయసులోనే సామాజిక సమస్యకు డిజిటల్ పరిష్కారం చూపించిన ఈ యువకుడి ఆలోచన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రాస్తే యాప్ పనిచేసే విధానం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫుట్‌పాత్‌పై ఎక్కడైనా ఆక్రమణ కనిపిస్తే.. ప్రజలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఫొటోను యాప్ ద్వారా తీసి పంపించవచ్చు. ఆ ఫిర్యాదు సంబంధిత అధికారులకు చేరుతుంది. దీంతో సమస్య ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రభుత్వ వ్యవస్థకు చేరవేసే వారధిగా ఈ యాప్ మారింది బెంగళూరు మహానగరంలో.

యాప్ ప్రారంభించిన కొద్ది వారాల్లోనే దీనికి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే 10వేల మందికి పైగా వినియోగదారులు రాస్తే ప్లాట్‌ఫామ్‌తో చేరగా.. 1,000కు పైగా ఫుట్‌పాత్ ఆక్రమణల కంప్లెయింట్స్ అందాయి. ప్రజలే నేకుదా పంపిన కొన్ని ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు సూర్య వెల్లడించాడు. దీంతో ఒక చిన్న ఆలోచన ఎలా నగర స్థాయి మార్పుకు దోహదపడుతుందో రాస్తే యాప్ నిరూపిస్తోంది.

►ALSO READ | టర్బో ఇంజిన్లు, రబ్బర్ పార్ట్స్‌పై E20 పెట్రోల్ ఎఫెక్ట్ : ARAI సంచలన రిపోర్ట్

కేవలం ఫిర్యాదులు స్వీకరించడం మాత్రమే కాకుండా.. ఈ డేటాను భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగించుకోవచ్చని సూర్య చెబుతున్నాడు. పదేపదే ఆక్రమణలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. సమస్యకు మూల కారణాలను విశ్లేషిస్తే ఫుట్‌పాత్‌లు మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా చూడవచ్చని అంటున్నాడు.

ప్రభుత్వం, గ్రేటర్ బెంగళూరు అథారిటీతో కలిసి పనిచేయాలని కోరుతున్న సూర్య..  మూడు కీలక సూచనలు చేశాడు. పౌరుల నుంచి వచ్చిన డేటాను ఉపయోగించడం, ఫుట్‌పాత్ శుభ్రపరిచే చర్యలకు ముందు-తర్వాత ఫొటోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం, వార్డు స్థాయి హీట్ మ్యాప్‌ల ద్వారా సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి నగర నిర్వహణను మరింత సమర్థవంతంగా మారుస్తాయని కుర్రోడు అంటున్నాడు.

ప్రస్తుతం రాస్తే ద్వారా వచ్చే ఫిర్యాదులు BBMP, GBA వంటి సంస్థల వాట్సాప్ ఛానళ్లకు చేరుతున్నాయి. అయితే అధికారిక వ్యవస్థల్లో యాప్‌ను నేరుగా అనుసంధానం చేస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుందని సూర్య అభిప్రాయపడుతున్నాడు. చిన్న వయసులోనే నగర సమస్యను గుర్తించి.. దానికి టెక్నాలజీతో పరిష్కారం చూపించిన ఈ యువ ఆవిష్కర్త భవిష్యత్‌లో నగరాల్లో సమస్యల పరిష్కారం, శుభ్రతకు పౌరుల భాగస్వామ్యానికి కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు.

©️ VIL Media Pvt Ltd.