RGV on Satluj: ‘సత్లుజ్’ను ఎన్‌కౌంటర్ చేయొద్దు.. దిల్జీత్ సినిమా వివాదంలోకి ఆర్జీవీ ఎంట్రీ.. ఒక్క ట్వీట్‌తో కలకలం..

‘సత్లుజ్’ (Satluj).. ఇపుడు ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. టాలెంటెడ్ సింగర్, యాక్టర్ దిల్జీత్ దోసాంజ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ డ్రామాపై ఎత్తులు పైఎత్తులు నడుస్తున్నాయి. 1984–1994 మధ్య పంజాబ్‌లో జరిగిన వివాదాస్పద ఘటనలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్డా (Jaswant Singh Khalra) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 48 గంటల్లోనే Zee5 ఇండియా నుంచి తొలగించబడింది. జూలై 3న Zee5లో సైలెంట్‌గా ప్రీమియర్ ప్రారంభమైన ఈ మూవీ, వచ్చిన వెంటనే స్ట్రీమింగ్ని ఆపేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ ఆర్జీవీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రాకు జరిగిన అన్యాయమే ‘సత్లుజ్’. ఈ సినిమాను స్ట్రీమింగ్ అవ్వనివ్వండి. ఎందుకంటే.. ‘నిజాన్ని ఎంత దాచిపెట్టాలని ప్రయత్నిస్తే, అది అంతకంటే బలంగా బయటపడుతుంది’ అని ఆర్జీవీ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ‘చూడాలి.. చర్చించాలి.. ఆపొద్దు’ అని వర్మ సూచించారు.
ఆర్జీవీ తన ట్వీట్‌లో పలు వాస్తవ విషయాలను ప్రస్తావించాడు. ఆయన మాటల్లోనే.. ‘‘ఇప్పుడే ‘సత్లుజ్’ చూశాను. ఇది ఒక సినిమా కాదు.. ఎన్నటికీ మానని లోతైన గాయం. మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకదాన్ని ఈ చిత్రం మన ముందుంచుతుంది. దిల్జీత్ దోసాంజ్ ఎలాంటి హీరోయిజం ప్రదర్శించకుండా, కేవలం తన మనస్సాక్షి, నిజాయితీనే ఆయుధాలుగా చేసుకుని అద్భుతంగా నటించాడు. అర్జున్ రాంపాల్ కూడా వ్యవస్థలోని నైతిక పతనాన్ని అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించాడు.
దర్శకుడు హనీ ట్రెహన్ ఈ కథను సంచలనంగా కాకుండా, దర్యాప్తు థ్రిల్లర్‌లా నెమ్మదిగా విప్పుతూ ముందుకు తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఫైళ్లు, దహన సంస్కారాల రికార్డులు, నిశ్శబ్ద సంభాషణల ద్వారా కథను చెప్పడం వల్ల ఈ చిత్రంలోని క్రూరమైన నిజాలు మరింత బలంగా మనసును తాకుతాయి.
ప్రజాస్వామ్యం తన పౌరులనే బలితీసుకుని, ఆ ఆధారాలను చెరిపేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే తాత్విక అంశాన్ని ఎలాంటి బోధన లేకుండా దర్శకుడు అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా విడుదల చుట్టూ నెలకొన్న వివాదాలే.. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే కళ తన అసలు లక్ష్యాన్ని సాధించిందని నిరూపిస్తున్నాయి. నిజమైన కళ అంటే అదే.. ‘సత్లుజ్’ అలాంటి చిత్రమే.
ALSO READ : అప్పట్లో పేడ.. ఇప్పుడు పాన్.. నటి దివ్య ఉన్ని ఘటనతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్!
ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు కేవలం వినోదానికే పరిమితమవుతున్న సమయంలో… నిజాయితీతో కూడిన కథలను సినిమా మాధ్యమం ఎంత శక్తివంతంగా చెప్పగలదో ‘సత్లుజ్’ మరోసారి గుర్తు చేసింది. ఈ సినిమా తప్పకుండా చూడాలి, చూపించాలి, చర్చించాలి, చర్చల ద్వారా అర్థం చేసుకోవాలి. సినిమాలోని బాధితుల్లా దీన్నీ ‘ఎన్‌కౌంటర్’ చేయొద్దు.
నా విజ్ఞప్తి ఒక్కటే.. జస్వంత్ సింగ్ ఖల్రాకు జరిగిన అన్యాయమే ‘సత్లుజ్’. ఈ సినిమాను స్ట్రీమింగ్ అవ్వనివ్వండి. ఎందుకంటే.. ‘నిజాన్ని ఎంత దాచిపెట్టాలని ప్రయత్నిస్తే, అది అంతకంటే బలంగా బయటపడుతుంది’ అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘సత్లుజ్’ భారత్‌లో స్ట్రీమింగ్ నిలిపివేసినా, Zee5 Globalలో మాత్రం అందుబాటులో ఉంది. ఈ పరిణామం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
Just saw SATLUJ and it is not a film , but a deep wound that will never heal. It stirs up the sludge in one of the darkest chapters of our history
This is cinema used as confrontation , where @diljitdosanjh acts with a quiet fury with no chest thumping heroism.. His only weapons…— Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2026
‘సత్లుజ్’ పై కేంద్ర చర్య.. కోర్టుకు వెళ్లనున్న మేకర్స్
దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ చిత్రం విడుదలైన 48 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు Zee5 ఇండియా నుంచి తొలగించబడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ‘Punjab 95’ పేరుతో సమర్పించిన ఈ చిత్రానికి CBFC సూచించిన 127 మార్పులను మేకర్స్ అంగీకరించలేదని సమాచారం. అయితే రచయిత నిరెన్ భట్ మాత్రం సినిమాలో అభ్యంతరకర అంశాలేవీ లేవని, ఇది మానవ హక్కుల కోసం పోరాడిన జస్వంత్ సింగ్ ఖల్రా జీవితకథ మాత్రమేనని అన్నారు. చిత్రాన్ని నిలిపివేయడంపై కోర్టును ఆశ్రయిస్తామని మేకర్స్ ప్రకటించారు.