Reading Time: 2 minutes

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు స్టార్ట్.. ప్రత్యేక దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకే పెద్ద పీట

Caption of Image.

తిరుమల: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక ఉత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంత‌రం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్రత్యేక పూజ‌లు నిర్వహించి పుట్టమన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు 30 శాతం అదనంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గరుడసేవ రోజున 38 శాతం అదనంగా అన్న ప్రసాదాలు, శ్రీవారి ఆలయంలో 30 శాతం అదనంగా స్వామివారి ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానియాలను 50 శాతం అదనంగా పెంచుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను 500 ట్రిప్పులు అదనంగా పెంచి 3100 ట్రిప్పులకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.

మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అనంతరం 16వ తేది ఉదయం తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్-1 లో నూతనంగా ఏర్పాటు చేసిన పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభిస్తారని తెలియజేశారు.

అంకురార్పణ విశిష్టత..

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

సూర్యాస్తమయం తరువాతే..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.

అంకురార్పణ క్రమం..

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.

అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత అగ్ని ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

©️ VIL Media Pvt Ltd.