Reading Time: < 1 minute
Pok Youth Crosses Loc Snapchat Love Story Repatriated Pakistan

Snapchat Love Story: ప్రేమకు సరిహద్దులు లేవంటారు.. కానీ ఆ ప్రేమ కోసమే సరిహద్దులు దాటిన ఒక పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) యువకుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా యాప్ ‘స్నాప్‌చాట్’ వేదికగా చిగురించిన ప్రేమ కోసం ఏకంగా ప్రాణాలకు తెగించి నియంత్రణ రేఖ (LoC) దాటిన జీషాన్ మీర్ అనే యువకుడిని భారత సైన్యం సురక్షితంగా మళ్లీ పాకిస్థాన్ అధికారులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. పీఓకేకు చెందిన జీషాన్ మీర్ అనే యువకుడికి జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక యువతితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది. ఎలాగైనా తాను ప్రేమించిన యువతిని కలుసుకోవాలని, అలాగే తన పూర్వీకుల భూమిని ఒకసారి చూడాలనే ఆశతో ఆ యువకుడు భారత్‌లోకి రావాలని ప్లాన్ చేశాడు.

ఈ క్రమంలోనే మే 31న ఉరీ సెక్టార్‌ వద్ద అత్యంత ప్రమాదకరమైన ఎల్‌ఓసీ సరిహద్దును దాటుతుండగా అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల్లో పట్టుబడిన జీషాన్ మీర్‌ను భారత రక్షణ రంగ, నిఘా వర్గాలు క్షుణ్ణంగా విచారించాయి. ఈ విచారణలో అతను కేవలం తన ప్రియురాలిని వివాహం చేసుకుని భారత్‌లోనే స్థిరపడాలనే ఉద్దేశంతోనే వచ్చానని, అంతకు మించి తనకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని వెల్లడించాడు. నిఘా వర్గాల సుదీర్ఘ విచారణ అనంతరం అతని వద్ద ఎలాంటి ఆయుధాలు గానీ, ఉగ్రవాద కోణం గానీ లేవని అధికారులు నిర్ధారించారు. మానవతా దృక్పథంతో ఆలోచించిన భారత ప్రభుత్వం, అన్ని రకాల చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం చకన్-దా-బాగ్ సరిహద్దు పాయింట్ వద్ద జీషాన్ మీర్‌ను పాకిస్థాన్ అధికారులకు సురక్షితంగా అప్పగించింది. స్నాప్‌చాట్ ప్రేమ కోసం యువకుడు బోర్డర్ దాటిన ఈ క్రేజీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.