
వర్షాకాలం మొదలైంది. అందరూ వేడి వేడిగా కమ్మని రుచులు ఆస్వాదిస్తారు. ఆకుకూరల స్నాక్స్.. రెసిపీస్ ఇమ్యూనిటి పవర్ తింటే ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది. పిల్లలు ఇష్టంగా తినే తోటకూర పకోడి.. పాలకూర సాంబార్.. బుర్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. .!
తోటకూర గట్టిపకోడి తయారీకి కావాల్సినవి
- శనగపిండి: ఒకటిన్నర కప్పు
- తోటకూర తరుగు: రెండు కట్టలు
- అల్లం ముక్కలు: కొన్ని
- వెల్లుల్లి రెబ్బలు: 15
- పచ్చిమిర్చి: నాలుగు
- జీలకర్ర: కొద్దిగా
- బియ్యప్పిండి: పావుకప్పు
- పసుపు: కొద్దిగా
- ఉప్పు: తగినంత
- కొత్తిమీర: కరివేపాకు
- తరుగు: కొద్దిగా
- నీళ్లు: తగినన్ని
- నూనె: వేగించేందుకు సరిపడా
తోటకూర గట్టి పకోడి తయారీ విధానం
మిక్సీ గిన్నెలో అల్లం తరుగు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేయాలి. గిన్నెలో తోటకూర. తరుగు. బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చి ముద్ద వేయాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి తోటకూర నుంచి నీళ్లు వచ్చేవిధంగా గట్టిగా పిసుకుతూ కలపాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు యాడ్ చేయాలి. కళాయిలో నూనె వేడి చేసి తక్కువ మంట మీద పెట్టి పిండిని పకోడీల్లా వేయాలి. తర్వాత ఎక్కువ మంటమీద బాగా వేగించుకుంటే కరకరలాడే తోటకూర పకోడి రెడీ. దీన్ని ఎయిర్ టైట్ డబ్బాలో రెండు – మూడు రోజులు నిల్వ ఉంచుకోవచ్చు కూడా.
పాలక్ సాంబార్ తయారీకి కావాల్సినవి
- పాలకూర తరుగు: 200 గ్రాములు
- కందిపప్పు: అరకప్పు
- నూనె: కొద్దిగా
- మెంతులు: అర టీ స్పూన్
- ఆవాలు: టీ స్పూన్
- ఇంగువ: కొద్దిగా
- ఎండుమిర్చి: రెండు
- సాంబార్ ఉల్లిగడ్డలు/ఉల్లిగడ్డ చీలికలు: ఒక కప్పు
- పచ్చిమిర్చి: నాలుగు
- కరివేపాకు: కొద్దిగా
- పసుపు: కొద్దిగా
- ఉప్పు: తగినంత
- చింతపండు పులుసు: 300 ఎమ్ఎల్.
- నీళ్లు :తగినన్ని
- సాంబార్ పొడి: రెండు టేబుల్ స్పూన్లు
- కారం: ఒక టేబుల్ స్పూన్
- కొత్తిమీర: కొద్దిగ
పాలక్ సాంబార్ తయారీ విధానం
ఒక మాదిరి మంటమీద కడాయిలో కందిపప్పును వేగించాలి. తర్వాత పప్పును మెత్తగా ఉడకబెట్టి మిక్సీ చేసి పెట్టాలి. ప్యాన్ పెట్టి నూనె వేడి చేసి మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేగించాలి.సాంబార్ ఉల్లిపాయలు వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పువేసి ఉల్లిగడ్డ ముక్కలు రంగుమారేవరకు మగ్గించాలి. ఆ తరువాత పాలకూర తరుగువేసి పసరువాసన పోయేవరకు మగ్గించి చింతపండు పులుసు, కారం, కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. సాంబార్ పొడివేసి మూతపెట్టి ఒకమాదిరి మంటమీద బాగా మరగనివ్వాలి.తర్వాత పప్పు వేసి బాగా మరిగించాక కొత్తిమీర వేసి దించితే ఘుమఘుమలాడే పాలకూర సాంబార్ రెడీ.
పాలక్ ఎగ్ బుర్జీ తయారీకి కావాల్సినవి
- పాలకూర తరుగు: 5 కట్టలు
- నూనె: పావుకప్పు
- ఉల్లిగడ్డ తరుగు: ఒక కప్పు
- పచ్చిమిర్చి: రెండు
- పసుపు: కొద్దిగా
- ఉప్పు: తగినంత
- కారం: టేబుల్ స్పూన్
- గుడ్లు: నాలుగు
- ధనియాలపొడి: ఒక టీస్పూన్
పాలక్ ఎగ్ బుర్జీ తయారీ విధానం
కళాయిలో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు వేసి పచ్చివాసన పోయేవరకు వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేయాలి. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు, కారం వేసి నూనె పైకి వచ్చేవరకు మగ్గించాలి. ఒక గిన్నెలో గుడ్లు పగలకొట్టి బాగా బీట్ చేసి పాలకూరలో పోసి కలపాలి. ఒక మాదిరి మంటమీద కలుపుతూ మగ్గించాలి. చివర్లో ధనియాల పొడివేసి దించేస్తే టేస్టీ పాలకూర బుర్జీ రెడీ.