Reading Time: 2 minutes

యాదాద్రిలో  12 చేనేత సంఘాలు ఏకగ్రీవం

Caption of Image.
  •  మరో ఏడు సంఘాల్లో 14 మంది మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవం
  •  29 సంఘాలకు ఎన్నికలు పలు సంఘాల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ప్యానెళ్లు పోటీ
  •  548 నామినేషన్లు.. నేడు పరిశీలన
  •  రేపు ఉపసంహరణ, తుది జాబితా, 10న ఎన్నికలు

యాదాద్రి, వెలుగు :  చేనేత సహకార సంఘాల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 12 సంఘాలకు డైరెక్టర్లు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. మరో ఏడు సంఘాల్లో మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలు మండలాల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ తరపున రెండు ప్యానెళ్లుగా డైరెక్టర్​ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్యానెళ్లు కాకుండా మరికొందరు నామినేషన్లు దాఖలు చేశారు. యాదాద్రి జిల్లాలో చేనేత కార్మిక సంఘాలు 42 ఉన్నాయి.

వీటిల్లో ఆలేరులోని సిల్క్​ సొసైటీ సభ్యత్వాల అంశంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ సంఘం మినహా మిగిలిన 41 సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైంది. వీటిల్లో ఓటు హక్కు కలిగిన సభ్యులు 8,651 ఉన్నారు. ఒక్కో సంఘానికి 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెండు డైరెక్టర్​ స్థానాలు మహిళలకు రిజర్వ్​ చేశారు. ఈ సంఘాల ఎన్నికలకు సంబంధించి శనివారం నామినేషన్​ ప్రక్రియ ముగిసింది. 

12 సంఘాలు ఏకగ్రీవం

ఎన్నికలు జరుగుతున్న 41 సంఘాలకు జనరల్​ కేటగిరిలో 532 మంది, మహళా రిజర్వేషన్​ కేటగిరిలో 138 నామినేషన్లు దాఖలు చేశారు.  ఇందులో 12 సంఘాలకు 9 మంది చొప్పునే నామినేషన్లు వేయడంతో ఆ సంఘాలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయినట్టయింది. మరో ఏడు సంఘాల్లోని మహిళలకు రిజర్వ్​ చేసిన డైరెక్టర్​ స్థానాల్లో రెండు చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో 14 మంది మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. 29 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

భారీగా నామినేషన్లు

జిల్లాలోని పలు మండలాల్లోని సంఘాలకు డైరెక్టర్​ స్థానాల కోసం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ తరపున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 9 డైరెక్టర్​ స్థానాలకు సిరిపురంలో 33, ఎల్లంకిలో 29 నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరిలో 28, పోచంపల్లి, నారాయణపురంలో 27 చొప్పున నామినేషన్లు వేశారు. కుంట్లగూడెంలో 25, నేలపట్ల, మోత్కూరులో 24 చొప్పున, వెల్వర్తి, చౌటుప్పల్​లో 23 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. 

నేడు తుది జాబితా

ఆదివారం నామినేషన్ల స్క్రూటినీ, సోమవారం ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న డైరెక్ట్రర్ల తుది జాబితా రిలీజ్ చేయడంతో పాటు గుర్తుల కేటాయింపు ఉంటుంది. 10న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకూ పోలింగ్​ జరుగుతుంది. సాయంత్రం లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. 

©️ VIL Media Pvt Ltd.