
భారతదేశంలో క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాది పెరుగుతుండటంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యవసరం అయింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ లైఫ్‌సైన్సెస్ సంస్థ, అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘షీల్డ్ మల్టీ-క్యాన్సర్ డిటెక్షన్ (Shield MCD)’ అనే వినూత్న రక్త పరీక్షను దేశంలో ప్రవేశపెట్టింది. ఒకే సారి రక్త నమూనా తీసి 10 రకాల సాధారణ క్యాన్సర్లకు సంబంధించిన సంకేతాలను గుర్తించే సామర్థ్యం ఈ పరీక్షకు ఉందని సంస్థలు వెల్లడించాయి.
అమెరికాకు చెందిన ప్రెసిషన్ ఆంకాలజీ సంస్థ గార్డెంట్ హెల్త్ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత, భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (MCED) రక్త పరీక్షగా గుర్తింపు పొందుతోంది. అయితే ఇది క్యాన్సర్‌ను నిర్ధారించే పరీక్ష కాదని, కేవలం ముందస్తు స్క్రీనింగ్ సాధనమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
షీల్డ్ MCD పరీక్ష ఎలా పనిచేస్తుంది?
45 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న, సగటు ప్రమాదం ఉన్న వ్యక్తుల కోసం ఈ పరీక్షను రూపొందించారు. క్యాన్సర్ కణాలు రక్తంలోకి విడుదల చేసే DNA శకలాల్లో కనిపించే “మిథైలేషన్” అనే రసాయన మార్పులను ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. ఆధునిక జన్యు సాంకేతికతతో పాటు కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో అసాధారణ DNA సంకేతాలను గుర్తించి, క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా? ఉంటే ఏ అవయవం నుంచి ప్రారంభమై ఉండవచ్చో కూడా అంచనా వేయగలదు. ఈ పరీక్ష ద్వారా రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, కాలేయం, ప్యాంక్రియాస్, అండాశయం, ప్రోస్టేట్, మూత్రాశయం, జీర్ణాశయం, అన్నవాహిక క్యాన్సర్లకు సంబంధించిన సంకేతాలను పరిశీలిస్తారు.
సాధారణ స్క్రీనింగ్‌తో తేడా ఏమిటి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మమ్మోగ్రఫీ, కోలోనోస్కోపీ, పాప్ స్మియర్, తక్కువ మోతాదు CT స్కాన్ వంటి పరీక్షలు ఒక్కో క్యాన్సర్‌ను మాత్రమే గుర్తించగలవు. కానీ షీల్డ్ MCD ఒకే రక్త పరీక్షతో అనేక రకాల క్యాన్సర్ల సంకేతాలను ఒకేసారి పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. దీంతో స్క్రీనింగ్ మరింత సులభంగా, తక్కువ ఇబ్బందితో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాదు. ఆ తర్వాత ఇమేజింగ్ స్కాన్లు, ఎండోస్కోపీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే నెగటివ్ ఫలితం వచ్చినా క్యాన్సర్ పూర్తిగా లేదని చెప్పలేమని, సాధారణ స్క్రీనింగ్ పరీక్షలను కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
2022లో భారతదేశంలో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 9 లక్షలకు పైగా మంది క్యాన్సర్ కారణంగా మరణించారు. ముఖ్యంగా ప్యాంక్రియాస్, కాలేయం, జీర్ణాశయం, అండాశయ క్యాన్సర్లకు ప్రస్తుతం విస్తృత స్థాయిలో స్క్రీనింగ్ కార్యక్రమాలు లేకపోవడంతో, ఈ తరహా MCED రక్త పరీక్షలు ముందస్తు గుర్తింపులో ఉపయోగపడే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఆరు ఆసియా దేశాల్లో 84 వేల మందికి పైగా పాల్గొన్న అధ్యయనంలో, ఈ తరహా మల్టీ-క్యాన్సర్ పరీక్షలు నిర్ధారిత క్యాన్సర్ కేసుల్లో సుమారు 79 శాతం వరకు సరిగ్గా గుర్తించగా, క్యాన్సర్ లేని వ్యక్తులను 99.9 శాతం ఖచ్చితత్వంతో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అలాగే సుమారు 80 శాతం కేసుల్లో క్యాన్సర్ ఏ అవయవం నుంచి ప్రారంభమైందో కూడా సరిగ్గా అంచనా వేసినట్లు తెలిపారు.
కొనసాగుతున్న పరిశోధనలు..
ఈ సాంకేతికత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, దీనిని పూర్తిస్థాయి రోగ నిర్ధారణ పరీక్షగా కాకుండా అదనపు స్క్రీనింగ్ సాధనంగా మాత్రమే ఉపయోగించాలని క్యాన్సర్ నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ పరీక్షలు క్యాన్సర్ మరణాలను ఎంత మేర తగ్గిస్తాయి? ఖర్చుకు తగిన ప్రయోజనం అందిస్తాయా? అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇండియాలో షీల్డ్ MCD పరీక్ష ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే త్వరలో అపోలో హాస్పిటల్స్ ద్వారా ఈ పరీక్ష అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, కొన్ని ప్రముఖ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు కూడా దీన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Zydus & Apollo Collaborate to Expand Multi-Cancer Detection Test in India | MCap 1,10,836.67 Cr
– Shield
MCD test detects multiple cancer types (bladder, colorectal, breast, prostate, oesophageal, gastric, liver, lung, ovarian, pancreatic) through a simple blood draw for… pic.twitter.com/QxYVLAEdlS
— Investor Feed (@_Investor_Feed_) July 3, 2026
Zydus & Apollo Collaborate to Expand Multi-Cancer Detection Test in India | MCap 1,10,836.67 Cr
MCD test detects multiple cancer types (bladder, colorectal, breast, prostate, oesophageal, gastric, liver, lung, ovarian, pancreatic) through a simple blood draw for…