Reading Time: < 1 minute
Hyderabad: ఉమ్రా యాత్రకు వెళ్లి వచ్చారు.. ఇంట్లో అడుగు పెట్టగానే ఊహించని సీన్..

పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్లిన ఓ కుటుంబాన్ని వారి సొంత బంధువులే నమ్మకద్రోహం చేశారు. ఇంట్లో ఎవరూ లేరనే సమాచారాన్ని ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్‌తో చోరీకి పాల్పడ్డారు. అయితే సీసీటీవీ సాయంతో పోలీసులు కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి హబీబ్ నగర్‍లో షేక్ అక్బర్ మొహియూద్ధీన్ తన కుటుంబంతో కలిసి జూన్ 23న పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన బాధితుడి బంధువులైన మహ్మద్ యూనుస్, షేక్ రమీజ్ మొహియుద్దీన్ ముందుగానే చోరీకి ప్రణాళిక రచించారు. తమకు పరిచయమున్న సందీప్‌ అనే స్నేహితుడిని కూడా ఇందులో భాగస్వామిని చేశారు.

జూలై 1న ముగ్గురు కలిసి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రూ.16 లక్షల నగదు, సుమారు 13.5 తులాల బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించి పరారయ్యారు. ఫిర్యాదు అందుకున్న హబీబ్‌నగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు కచ్చితమైన ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. జూలై 3న భోయిగూడ కమాన్ వద్ద వాహన తనిఖీల సమయంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో లభించిన సమాచారం ఆధారంగా మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.

వీడియో చూడండి..

నిందితుల వద్ద నుంచి 134.44 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.12.50 లక్షల నగదు, రూ.1.40 లక్షల విలువైన రాడో వాచ్, వెండి పట్టీలు, చోరీకి ఉపయోగించిన హోండా యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ.29 లక్షలుగా పోలీసులు వెల్లడించారు.ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇంటి పరిస్థితులు, కుటుంబం బయటకు వెళ్లిన విషయం ముందే తెలిసిన బంధువులే నిందితులుగా తేలడం కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..