
హర్యానాలో భారీ దోపిడీ కేసులో నిందితుడిగా ఉండి, చాలా కాలంగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఒక కరుడుగట్టిన నేరస్థుడి ఆట ఎట్టకేలకు హైదరాబాద్‌లో ముగిసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన హర్యానా స్పెషల్ టీమ్ పోలీసులు.. స్థానిక ఐఎస్ సదన్ పోలీసుల సహకారంతో నగరంలో ఒక మెరుపు ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలో నమోదైన ఒక కీలక దోపిడీ కేసులో యశ్వంత్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అక్కడ క్రైమ్ చేసిన అనంతరం పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న అతడు.. భాగ్యనగరంలో తలదాచుకున్నట్లు హర్యానా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన హర్యానా పోలీసుల ప్రత్యేక బృందం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సైలెంట్‌గా హైదరాబాద్‌కు చేరుకుంది. స్థానిక ఐఎస్ సదన్ పోలీసులను సంప్రదించి, వారి సహాయంతో చంపాపేటలోని దుర్గా భవానీ నగర్ పరిసరాల్లో నిఘా పెట్టింది. నిందితుడి కదలికలను నిరంతరం గమనిస్తూ.. సరైన సమయం చూసి ఒక్కసారిగా మెరుపు దాడి చేసి యశ్వంత్‌ను బంధించారు.
హైదరాబాద్ లింకులపై ఆరా..
యశ్వంత్‌పై హర్యానాలో తీవ్రమైన దోపిడీ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అతడు హైదరాబాద్‌లో ఎంతకాలంగా తలదాచుకుంటున్నాడు? నగరంలో అతనికి ఎవరైనా ఆశ్రయం కల్పించారా? స్థానికంగా ఎవరితోనైనా నేరపూరిత సంబంధాలు ఉన్నాయా? అనే పలు కోణాల్లో పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా విచారిస్తున్నారు.
హర్యానాకు తరలింపు.. దర్యాప్తు ముమ్మరం
అరెస్టు ప్రక్రియ పూర్తికాగానే నిందితుడు యశ్వంత్‌ను తదుపరి విచారణ, కోర్టు హాజరు పరచడం కోసం పోలీసులు హర్యానాకు తరలిస్తున్నారు. ఈ దోపిడీ కేసులో యశ్వంత్‌తో పాటు మరికొందరి పాత్ర ఉందా? ఈ గ్యాంగ్‌లో ఇంకా ఎవరైనా పరారీలో ఉన్నారా? అనే అంశాలపై హర్యానా పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హర్యానా పోలీసులు జరిపిన ఈ సీక్రెట్ ఆపరేషన్ సంచలనంగా మారింది.