
Hrithik Roshan: కొన్ని సినిమా కాంబినేషన్లు ప్రకటించిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేస్తాయి. స్టార్ హీరో, పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్ అంటే సోషల్ మీడియాలో ఊహాగానాలు కూడా అదే స్థాయిలో మొదలవుతాయి. ఇప్పుడు అలాంటి చర్చే నడుస్తోంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ , హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలన విజయాలు అందుకున్న హోంబలే ఫిలిమ్స్, హృతిక్ రోషన్‌తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే దర్శకుడు ఎవరన్న అంశంపై అధికారిక ప్రకటన లేకపోవడంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హోంబలే ఫిలిమ్స్, కంటెంట్‌తో పాటు భారీ నిర్మాణ విలువలకు పెట్టింది పేరుగా నిలిచింది. అలాంటి సంస్థ హృతిక్ రోషన్‌తో సినిమా ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దర్శకుడి పేరును మాత్రం నిర్మాతలు ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
పరశురామ్ గతంలో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘గీత గోవిందం’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరి ఘన విజయం సాధించింది. అనంతరం మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటి నుంచి ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై స్పష్టత లేకపోవడంతో, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారనే ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తించింది. క్లాస్, కమర్షియల్ అంశాలను తన స్టైల్ మార్క్ తో చూపించగల దర్శకుడిగా పరశురామ్‌కు ఉన్న గుర్తింపు కారణంగా ఈ వార్తలను చాలామంది నమ్మే పరిస్థితి కూడా ఏర్పడింది. ఫిలింనగర్ వర్గాల్లో కూడా కొంతకాలంగా హోంబలే ఫిలిమ్స్, పరశురామ్ మధ్య చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం వినిపించింది. హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు పరశురామ్ కథనం జతకడితే కొత్త తరహా పాన్ ఇండియా సినిమా వచ్చే అవకాశముందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడు మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, పరశురామ్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఏ దర్శకుడినీ అధికారికంగా ఎంపిక చేయలేదని సమాచారం. నిర్మాతలు కూడా దర్శకుడి పేరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ తన కెరీర్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆల్ఫా’ చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించిన ఆయన, త్వరలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న జైలర్ 2లో కూడా పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు హోంబలే ఫిలిమ్స్ కూడా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ సినిమా దర్శకుడి పేరు ఎప్పుడు ప్రకటిస్తారు? చివరకు ఆ అవకాశం ఎవరికి దక్కుతుంది? అనే అంశాలపై ఇప్పుడు సినీ అభిమానుల దృష్టి నిలిచింది. ప్రస్తుతం మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను ఊహాగానాలుగానే చూడాల్సిందిగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.