Reading Time: 2 minutes
ఓరీ దేవుడో..బంగారం కంటే ఖరీదు ఈ పక్షి గూడు..ఆరోగ్యం, అందం కోసం లక్షలు ఖర్చు చేస్తున్న ధనవంతులు!

ప్రపంచంలో వజ్రాలు, బంగారం వంటి విలువైన లోహాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఈ భూమిపై ఒక పక్షి లాలాజలంతో చేసే గూడు, బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతుందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. స్విఫ్ట్‌లెట్ (Swiftlet) అనే ఒక అరుదైన పక్షి నిర్మించే గూళ్ళకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారాన్ని మించిన డిమాండ్ ఉంది. అందుకే దీన్ని ప్రజలు తెల్ల బంగారం (వైట్ గోల్డ్) అని పిలుస్తారు.

కఠినమైన గుహల్లో లాలాజలంతో నిర్మాణం:

స్విఫ్ట్‌లెట్ పక్షులు ఎక్కువగా చైనా, జపాన్, వనవాటు, మలేషియా, పసిఫిక్ మహాసముద్రంలోని దట్టమైన అడవులు, చీకటి కొండ గుహలలో నివసిస్తాయి. ఇవి గూడు కట్టుకునే ప్రక్రియ చాలా వింతగా, కఠినంగా ఉంటుంది. ఇవి రాతి పగుళ్లపై తమ నోటి నుండి వచ్చే చిక్కటి లాలాజలాన్ని కొద్దికొద్దిగా ఉమ్మి, అది గాలికి ఆరిపోయేలా చేసి, గిన్నె ఆకారంలో గూడును మలుస్తాయి. ఈ లాలాజలం పూర్తిగా ఎండిన తర్వాత రాయిలా గట్టిపడుతుంది. ఈ గూళ్లను సేకరించడం ప్రాణాలతో చెలగాటమే. ఎందుకంటే ఇవి అత్యంత ఎత్తైన కొండ చరియలు, ప్రమాదకరమైన లోతైన గుహలలో ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు.. సంజీవనిగా గుర్తింపు:

ఈ పక్షి గూళ్లకు అంత ధర ఉండటానికి ప్రధాన కారణం వాటిలో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలే. చైనా సాంప్రదాయ వైద్యంలో దీనిని ఒక సంజీవని లాంటి ఆహారంగా భావిస్తారు. ఇందులో హై-ప్రోటీన్, శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా, దీనిని ఒక బ్యూటీ ఫుడ్ (Beauty Food) గా పిలుస్తారు. ధనవంతులు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించడానికి, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి దీనిని ఒక సీక్రెట్ డైట్‌గా తీసుకుంటారు. అలాగే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడి కోలుకుంటున్న వారికి ఇది శీఘ్ర ఉపశమనాన్ని ఇస్తుందని నమ్ముతారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఖరీదైన బర్డ్స్ నెస్ట్ సూప్:

ఈ స్విఫ్ట్‌లెట్ గూళ్లను శుభ్రం చేసి హాంగ్‌కాంగ్, సింగపూర్ వంటి దేశాల్లోని లగ్జరీ రెస్టారెంట్లలో విలాసవంతమైన బర్డ్స్ నెస్ట్ సూప్ తయారు చేస్తారు. ఈ సూప్ ఒక్క బౌల్ (గిన్నె) ధర సుమారు 150 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14,000 పైమాటే) ఉంటుంది. ఒకే ఒక్క గూడుతో దాదాపు 10 నుండి 15 బౌల్స్ సూప్ తయారు చేయవచ్చు. అంటే ఒక పక్షి గూడు విలువ మార్కెట్లో ఉన్న 10 గ్రాముల బంగారం ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న పక్షి నోటి లాలాజలం ఇంతటి విలాసవంతమైన ఆహారంగా మారి లక్షల రూపాయల వ్యాపారానికి కేంద్రబిందువు కావడం నిజంగా ప్రకృతి వింతలలో ఒకటి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..