
Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత సీనియర్ ఓపెనర్ సంజూ శామ్సన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. శామ్సన్‌ను పక్కనబెట్టడానికి గల స్పష్టమైన కారణాన్ని వెల్లడించనప్పటికీ, అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చినట్లు ప్రకటించాడు. దీన్ని బట్టి కేరళ స్టార్ బ్యాటర్‌పై వేటు పడినట్లు స్పష్టమైంది. “జట్టులో ఒక మార్పు జరిగింది. సంజూ స్థానంలో వైభవ్ జట్టులోకి వచ్చాడు” అని టాస్ గెలిచిన అనంతరం శ్రేయస్ అయ్యర్ ప్రకటించాడు. సంజూ శామ్సన్‌ను పక్కనబెట్టడం అనేది భారత క్రికెట్‌లో ఉన్న విపరీతమైన పోటీకి నిదర్శనమా అని ప్రశ్నించగా, కెప్టెన్ అవుననే సమాధానమిచ్చాడు. “కచ్చితంగా, ఇక్కడ పోటీ ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కూ ఇది మారుతూ ఉంటుంది. గత కొన్ని నెలలుగా, ఏళ్లుగా భారత్ అందిస్తున్న అపారమైన ప్రతిభను చూడటం కళ్లకు ఎంతో ముచ్చటగా ఉంది. అలాగే ఇది సిరీస్ అంతటా మాలో అలసత్వం రాకుండా అలర్ట్‌గా ఉంచుతుంది. ఎందుకంటే ఒత్తిడి అనేది ఒక ప్రత్యేక హక్కుగా నేను భావిస్తాను. ఒత్తిడిలో రాణిస్తే దానికి తగిన ఫలితం కచ్చితంగా ఉంటుంది” అని అయ్యర్ వ్యాఖ్యానించాడు.
నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు వరకు శామ్సన్‌ను తొలగిస్తారనే సూచనలు ఎక్కడా కనిపించలేదు. మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కూడా సంజూ శామ్సన్‌కే తాము అండగా ఉంటామని హింట్ ఇచ్చారు. “టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మ మాకు ఉన్నాడు. అలాగే సంజూ వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు, ఐపీఎల్‌లోనూ రాణించాడు. ఒక కోచింగ్ స్టాఫ్‌గా మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారికి మద్దతుగా నిలవడమే సరైన పద్ధతి. అవును, ఒక యువ ఆటగాడు (వైభవ్) జట్టు తలుపు తడుడుతున్నాడు, అది ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయమే. కానీ కేవలం ఆ ఇద్దరు ఓపెనర్లకే కాకుండా మొత్తం గ్రూప్‌నకు మేమంతా మీకు అండగా ఉంటామనే నమ్మకాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం” అని మోర్కెల్ పేర్కొన్నారు. కానీ, తీరా మ్యాచ్ సమయానికి మేనేజ్‌మెంట్ శామ్సన్‌ను పక్కనబెట్టి వైభవ్‌కు క్యాప్ ఇచ్చింది.
భారత తుది జట్టు (playing 11):
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.