Reading Time: 2 minutes

ప్రజలు ద్వేషిస్తారనుకున్నా.. కానీ ఇంత మంది ఏడుస్తరనుకోలే: ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్

Caption of Image.

వాషింగ్టన్: దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు లక్షల సంఖ్యలో జనం పొటెత్తడం చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ అయ్యారు. ఇరాన్ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారని అనుకున్నా.. కానీ అతడి అంత్యక్రియల్లో భారీ సంఖ్యలో జనం పాల్గొని సంతాపం తెలపడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. తాను ఊహించిన దానికి అక్కడ భిన్నమైన వాతావరణం కనిపించిందని పేర్కొన్నారు. అయితే, ఖమేనీ కోసం ఇరాన్ ప్రజలు నకిలీ కన్నీ్ళ్లు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఒక్క దెబ్బతో అందరిని లేపేయొచ్చు: ట్రంప్

మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ అగ్రనాయకత్వమంతా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఇరాన్ అగ్ర నాయకులను ఉద్దేశించి ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ అగ్రనాయకత్వమంతా ఒక చోటకు చేరింది. మేం తలుచుకుంటే ఒక్క దెబ్బతో వాళ్లందరినీ లేపేయొచ్చు. కానీ మేం అలా చేయం. ఎందుకంటే ఆ తర్వాత చర్చలు జరపడానికి అక్కడ ఎవరూ మిగలరు’’ అని ట్రంప్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

మేం మంచివాళ్లం కావడంతో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ఇరాన్‎కు వారం రోజుల సమయం ఇచ్చామన్నారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతోన్న వేళ ఇరాన్‎ను రెచ్చగొట్టే తరహాలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఇరుదేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. 

అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ హతం:

2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. ఖమేనీ మరణంతో పశ్చిమాసియా భగ్గుమంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేసింది. దీంతో దాదాపు 4 నెలలుగా మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది. 

ఈ నేపథ్యంలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య ప్రాథమిక శాంతి అవగాహన ఒప్పందం కుదరడంతో అలీ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్ డిసైడ్ అయ్యింది.

లాంఛనంగా ఖమేనీకి వీడ్కోలు:

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దేశాన్ని శాసించిన తమ సుప్రీం లీడర్‎కు లాంఛనంగా వీడ్కోలు పలకాలని ఇరాన్ నిర్ణయించింది. అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 5, 6, 7 తేదీలలో టెహ్రాన్, ఖోమ్ నగరంలో జరగనున్నాయి. తుది కార్యక్రమం జూలై 9న మషద్ నగరంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇరాన్ ప్రపంచ దేశాల నాయకులను ఆహ్వానించింది. 

జులై 5న ప్రారంభమైన ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశ్రునయనాల నడుమ తమ దేశ మాజీ అధ్యక్షుడికి తుది వీడ్కోలు పలికారు. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో లక్షల సంఖ్యలో ఇరానియన్లు పాల్గొని కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

©️ VIL Media Pvt Ltd.