Reading Time: 2 minutes
Agra Woman Arrested For Allegedly Killing Husband Burying Body Under Bathroom Floor

ముస్కాన్ అనే వివాహిత అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నడని భర్తను చంపి బ్లూ డ్రమ్ములో కుక్కి సిమెంట్ తో మూసేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజా రఘువంశీ ఘటనతో పాటు ఇటీవల పూణేలో కేతన్ అగర్వాల్ హత్య వరకు భార్యలు భర్తలను అంతమొందించిన ఘటనలు కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసి, అతని మృతదేహాన్ని ఇంటి బాత్‌రూమ్ లో పాతిపెట్టిన కేసులో పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

అదృశ్యమైనట్లు ఫిర్యాదు.. దర్యాప్తులో షాకింగ్ నిజం

పోలీసుల వివరాల ప్రకారం, 45 ఏళ్ల సురేంద్ర శర్మ కొంతకాలంగా కనిపించడం లేదని అతని భార్య రూబీ శర్మ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను ప్రశ్నించగా అనుమానాలు బలపడ్డాయి. ఇంటి బాత్‌రూమ్‌ను పరిశీలించిన పోలీసులు నేలను తవ్వగా, అక్కడ సురేంద్ర శర్మ మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ కేసు హత్యగా మారింది.

పాయసంలో నిద్ర మాత్రలు కలిపి హత్య చేసినట్లు ఆరోపణ

మీడియా కథనాల ప్రకారం, రూబీ శర్మ ముందుగా తన భర్తకు పాయసంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిందని, అనంతరం అతన్ని హత్య చేసి మృతదేహాన్ని బాత్‌రూమ్ నేల కింద పాతిపెట్టి, దానిపై కాంక్రీట్ వేసి ఆనవాళ్లు చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య సుమారు నెలన్నర క్రితమే జరిగినట్లు సమాచారం.

మద్యపానం, కుటుంబ కలహాలే కారణమా?

ప్రాథమిక విచారణలో, భర్త మద్యపానానికి బానిస కావడం, తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తెలిపిన వివరాల ప్రకారం, రూబీ శర్మను అరెస్టు చేసి విచారిస్తున్నారు. హత్య జరిగిన పరిస్థితులు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది.

పొరుగువారికి ముందే అనుమానం

స్థానిక నివాసి గౌరవ్ దీక్షిత్ తెలిపిన వివరాల ప్రకారం, సురేంద్ర శర్మ, రూబీ శర్మల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సురేంద్ర శర్మ స్వస్థలం రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కాగా, గత తొమ్మిదేళ్లుగా కుటుంబంతో కలిసి ఆగ్రాలోని రేణుకా ధామ్ కాలనీలో నివసిస్తున్నాడు. సురేంద్ర కనిపించకుండా పోయిన తర్వాత పొరుగువారు పలుమార్లు రూబీ శర్మను ప్రశ్నించినప్పటికీ, ఆమె ప్రతిసారీ వేర్వేరు కారణాలు చెబుతూ తప్పించుకునేదని స్థానికులు తెలిపారు. దీంతో వారికి అనుమానం వచ్చిందని చెప్పారు.

దర్యాప్తు కొనసాగుతోంది

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.