Reading Time: 2 minutes
Guntur: పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ను మోసం చేసిన యువతి… కేసు నమోదు

మంగళగిరిలోని ఎల్ బీ నగర్ కు చెందిన సతీష్ 16వ బెటాలియన్ లో ఏపిఎస్పీ కానిస్టేబుల్. ప్రస్తుతం వైజాగ్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో జయశ్రీ పాండా అనే మహిళ సతీష్ కు ఫోన్ చేసింది. డిజిపి కార్యాలయంలో పనుందని సాయం చేయాలని అడిగింది. అయితే తాను అక్కడ పనిచేయడం లేదని సతీష్ ఆమెకు చెప్పాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో జయ శ్రీ పాండా… సతీష్ ను ట్రాప్ లోకి దించింది. తనకు పెళ్లి కాలేదన్న జయశ్రీ తనకు తల్లిదండ్రుల వద్ద ఆస్తి వస్తుందని నమ్మబలికింది. తనకు ఒక కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని నెలకి లక్షన్నర జీతం అని చెప్పింది. ఇద్దరి మధ్య చనువు పెరిగిందని గుర్తించిన జయశ్రీ ఏకంగా పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. అయితే సతీష్ తనకు వివాహం అయిన సంగతి జయశ్రీతో చెప్పాడు.

సతీష్ కు వివాహం అయిన సంగతి తెలుసని చెప్పిన జయశ్రీ…. విడాకులు కూడా తీసుకున్న విషయం తెలుసుకున్నానని ఆ తర్వాతే పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆమె ఒత్తిడితో పెద్దల సమక్షంలో మే 13వ తేదిన ఓ దేవాలయంలో సతీష్.. జయశ్రీని వివాహం చేసుకున్నాడు. నెల రోజుల పాటు ఇద్దరి కలిసి మెలిసి ఉన్నారు. గత నెల పదమూడో తేదిన జయశ్రీ ఇంట్లో ఉన్న 200 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు తీసుకొని వెళ్లిపోయింది. జయశ్రీ వెళ్లి తిరిగి రాకపోవడంతో ఎక్కడకు వెళ్లావంటూ సతీష్ ప్రశ్నించాడు. అదే విధంగా బంగారం, డబ్బు ఎక్కడా అని కూడా ఆరా తీశాడు. తానే తీసుకెళ్లానని చెప్పిన జయ శ్రీ తన అత్తయ్య ఇంట్లో ఉన్నానని చెప్పుకొచ్చింది. కొద్దీ రోజుల చూసిన తర్వాత కూడా జయ శ్రీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సతీష్ ఆమెను ఫోన్లో సంప్రదించాడు.

అయితే తాను తన అన్నయ్య వద్ద పలాసలో ఉన్నానని…తనకు విడాకులు కావాలని చెప్పింది. పెద్దల సమక్షంలో నగదు ఇచ్చి విడాకులు తీసుకోవాలని లేదంటే తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించింది. దీంతో అనుమానం వచ్చిన సతీష్ మంగళగిరి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు తనిచ్చిన ఫిర్యాదులో జయ శ్రీ చేసిన మోసం చేసిందని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మంగళగిరి పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.