
అమరావతి, జులై 5: ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ 2026 జూన్) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (జులై 5, 2026)రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అభ్యర్ధులకు సూచనాలు జారీ చేసింది. టెట్ పరీక్ష 2 పేపర్లకు ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే ఉపాధ్యాయ అభ్యర్థులు తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. టెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో 40 నుంచి 50 శాతం మార్కులతో ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు డీఈఎల్ఈడీ (D.El.Ed), బీఈడీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ ఒక్కో పేపర్ (Paper 1A, 1B, 2A, 2B)కు విడిగా.. రూ.1000 చెల్లించవల్సి ఉంటుంది.
ఏపీ టెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెట్ అర్హత సాధించిన వారికి ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5 నుంచి 21 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జులై 25 నుంచి టెట్ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ముగిసిన అనంతరం ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 8న తుది ఆన్సర్ కీని విడుదల చేసి, అనంతరం సెప్టెంబర్ 15న టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.