
Explained: యూరప్ అంటే చల్లని వాతావరణం. వేసవి వచ్చినా భరించలేనంత ఎండలు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అదే యూరప్ వేడితో అల్లాడుతోంది. 40డిగ్రీల ఉష్ణోగ్రతలు, కరిగిపోతున్న రహదారులు, ఆగిపోతున్న రైళ్లు, మంటలు అంటుకుంటున్న అడవులు, ఆస్పత్రులకు పోటెత్తుతున్న ప్రజలు. ఇలా యూరప్ పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. అయితే ఇప్పుడు కనిపిస్తున్న తీవ్ర వేసవులు భవిష్యత్‌లోనూ సాధారణంగా మారే ప్రమాదం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
యూరప్ ఎందుకు వేడెక్కుతోంది?
2026 జూన్‌లో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంది. జర్మనీ, పోలాండ్ లాంటి దేశాల్లో 40 డిగ్రీలు దాటాయి. రైలు పట్టాలు వేడెక్కాయి. విద్యుత్ వ్యవస్థలపై భారీ ఒత్తిడి పడింది. అనేక ప్రాంతాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ప్రకటించాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో హీట్ వేవ్ కారణంగా వెయ్యికి పైగా అదనపు మరణాలు నమోదైనట్టు అంచనాలు చెబుతున్నాయి. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతోందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు.
ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా యూరప్ వేడెక్కుతోందని చెబుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పేరుకుపోవడం వల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం ఇప్పుడు మరింత తీవ్రంగా బయటపడుతోంది. ఒకప్పుడు వందేళ్లకు ఒకసారి వచ్చే తీవ్ర వేడి ఇప్పుడు కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.
హీట్ డోమ్ అంటే ఏంటి?
ఈ మార్పులో హీట్ డోమ్ అనే వాతావరణ పరిస్థితి కీలక పాత్ర పోషిస్తోంది. అధిక పీడన వ్యవస్థ ఒక ప్రాంతం మీద చాలా రోజుల పాటు నిలిచిపోతే వేడి బయటకు వెళ్లదు. నేల నుంచి వచ్చే వేడి మళ్లీ కిందకే చేరుతూ ఉష్ణోగ్రతలను మరింత పెంచుతుంది. ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఉండేవి. కానీ ఇప్పుడు భూమి ముందే వేడిగా ఉండటంతో అదే హీట్ డోమ్ గతంతో పోలిస్తే మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే 2003 సంవత్సరాన్ని గుర్తు చేసుకోవాలి.
ఆ ఏడాది యూరప్‌ను తాకిన భయంకరమైన హీట్ వేవ్ కారణంగా సుమారు 70వేల మంది ప్రాణాలు కోల్పోయారని అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పట్లో అది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే విపత్తుగా భావించారు. కానీ ఇప్పుడు అదే స్థాయి వేడి పదుల రెట్లు ఎక్కువ అవకాశంతో వస్తోందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 50సంవత్సరాల క్రితం దాదాపు అసాధ్యంగా భావించిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు వాస్తవంగా నమోదవుతున్నాయి.
ఈ ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కూడా తీవ్రంగా పడుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం తన ఉష్ణాన్ని నియంత్రించుకోలేక హీట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఒంటరిగా నివసించే వారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ది లాన్సెట్ కౌంట్‌డౌన్ అధ్యయనం ప్రకారం 2024లో యూరప్‌లో దాదాపు 62,000 మంది వేడి కారణంగా మరణించినట్టు అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ప్రకృతి కూడా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఆల్ప్స్ పర్వతాల్లోని హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి. ఒకసారి కరిగిపోయిన ఈ మంచు తిరిగి పాత స్థాయికి చేరడం దాదాపు అసాధ్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ హిమానీనదాలే యూరప్‌లోని అనేక ప్రధాన నదులకు నీటి మూలం. ఇవి తగ్గిపోతే భవిష్యత్తులో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి లాంటివి ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. దీంతో తుఫానులు, భారీ వర్షాలు, కరువు పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. మరో పెద్ద సమస్య యూరప్ నగరాల నిర్మాణ విధానం. అక్కడి ఇళ్లు, భవనాలు, రైల్వే వ్యవస్థలు అన్నీ చలిని తట్టుకునేలా నిర్మించారు. వేడిని బయటకు పంపించే విధంగా వాటిని నిర్మించలేదు. అందుకే ఇప్పుడు ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ నగరాల జీవనం స్తంభిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వాలకు ఒక కీలక సూచన చేసింది. చలికాలంలో ఫ్లూ కోసం ఎలా ముందుగానే సిద్ధమవుతారో, ఇకపై వేసవి వేడి కోసం కూడా అలాగే శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచిస్తోంది. అయితే ఆశ పూర్తిగా పోయిందని శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఇప్పటికైనా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తే భవిష్యత్తులో వచ్చే హీట్ వేవ్స్ తీవ్రతను తగ్గించవచ్చని చెబుతున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పచ్చదనం పెంపు, నీటి నిర్వహణ, భవనాల మార్పులు, శుభ్రమైన ఇంధన వినియోగం లాంటి చర్యలు తీసుకుంటే వేలాది ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేస్తున్నారు.
ఒకప్పుడు యూరప్‌లో వేసవి అంటే ఆహ్లాదకరమైన కాలంగా భావించేవారు. ఇప్పుడు అదే వేసవి ప్రాణాలు తీసే ప్రమాదంగా మారుతోంది. ఇది యూరప్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ప్రతి దేశం ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. మనం ఇవాళ తీసుకునే నిర్ణయాలే 2050లో మన పిల్లలు అనుభవించే వేసవిని నిర్ణయించబోతున్నాయి. అందుకే శాస్త్రవేత్తల హెచ్చరికను మరో వార్తగా కాకుండా భవిష్యత్తు కోసం వచ్చిన చివరి అవకాశంగా చూడాల్సిన సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి.