Reading Time: 2 minutes

లక్షకు చేరువలో అక్రమ పింఛన్లు.. లైవ్ అథెంటిఫికేషన్ విస్తుపోయే విషయాలు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛన్ల పథకంలో ప్రక్షాళన పూర్తికావచ్చింది. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టిన ‘లైవ్‌‌‌‌ అథెంటిఫికేషన్‌‌‌‌’ (జీవించి ఉన్నట్లు ధ్రువీకరణ) ప్రక్రియలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన వెరిఫికేషన్‌‌‌‌లో తేలిన అక్రమ పింఛన్ల సంఖ్య లక్షకు చేరువైంది. ఏండ్ల కిందనే మరణించిన వారి పేర్ల మీద ఇంకా పింఛన్లు డ్రా అవుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. 

ఇప్పటివరకు సుమారు 95 వేల మందికి పైగా అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ పెన్షన్లను తొలగించి, వారి స్థానంలో అర్హులైన పేదలకు పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మిగిలిన 2 లక్షల మంది లబ్ధిదారుల లైవ్ అథెంటిఫికేషన్‌‌‌‌ ప్రక్రియను వేగవంతం చేసింది. అదే సమయంలో కొత్తగా 2 లక్షల మంది అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేయ‌‌‌‌డం ద్వారా కొత్తగా మరో3 ల‌‌‌‌క్షల మంది పింఛన్లు పొంద‌‌‌‌నున్నారు.

మరణించిన 63 వేల మంది పేర్లపై పింఛన్ల డ్రా..

రాష్ట్రంలో 42 లక్షల మంది పింఛను దారులుండగా.. అందులో 19 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అవుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో చేపట్టిన వెరిఫికేషన్‌‌‌‌లో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. ఏండ్ల కిందనే మరణించిన 63,532 మంది పేరిట ఇప్పటికీ పింఛను సొమ్ము డ్రా అవుతుండటం గమనార్హం.  మరోవైపు.. 27,158 మంది లబ్ధిదారులు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఫోన్ ద్వారా సంప్రదించినా ఎలాంటి స్పందన రాకపోవడంతో వారి వివరాలపై విచారణ జరుపుతున్నారు. సుమారు 5 వేల మంది రాష్ట్రం వెలుపల నివసిస్తూ.. ఇతర రాష్ట్రాల్లోని సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 700 మంది లైవ్ ఆథెంటిఫికేషన్‌‌‌‌కు సహకరించకుండా.. పెన్షన్ కొనసాగింపుపై ఆసక్తి చూపడం లేదు.

12 వేల మంది ఆధార్‌‌‌‌‌‌‌‌లో తేడాలు.. 

ధృవీకరణలో కొందరు లబ్ధిదారులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 12 వేల మందికి ఆధార్ వివరాల్లో తేడాలుండగా.. మరో 33 వేల మందికి వేలిముద్రలు సరిపోలకపోవడం (బయోమెట్రిక్), ఐరిస్ నమోదు కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీరికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ధృవీకరణ పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

అంతేకాకుండా, అనర్హులను తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న అనవసర భారాన్ని తగ్గించి, ఆ నిధులను అర్హులైన పేదలకు అందించాలని సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం గుర్తించిన అనర్హుల స్థానంలో, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి సుమారు 3 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు మార్గం సుగమం చేస్తోంది.

ఉత్తర తెలంగాణ ముందంజ..

ఈ ప్రక్షాళన ప్రక్రియలో కొన్ని జిల్లాలు వంద శాతం పురోగతి సాధించగా.., మరికొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కరీంనగర్ జిల్లా 1,19,458 మంది లబ్ధిదారుల వెరిఫికేషన్‌‌‌‌ను పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచింది. మంచిర్యాల 22,641 మంది, ములుగు జిల్లాలో 7,900 మంది వివరాలను వెరిఫై చేసి వంద శాతం పూర్తి చేశారు. నల్గొండ జిల్లాలో 99.93 శాతం, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 99.73 శాతం పూర్తిచేశారు.

రంగారెడ్డి 64.97 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 65.38 శాతం, హైదరాబాద్ 67.29శాతంతో వెనుకబడి ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌‌‌‌లోనే ఇంకా 82 వేల మందికి పైగా వివరాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 2లక్షల మంది ఆథెంటిఫికేషన్‌‌‌‌ను త్వరితగతిన పూర్తిచేసి, పింఛన్ల పంపిణీలో జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

©️ VIL Media Pvt Ltd.