
ప్రాణం విలువ ఎంత? ఒక మనిషి బతకడానికి అయ్యే ఖర్చు దేశాన్ని బట్టి మారిపోతుందా? ఒకే జబ్బు… ఒకే రసాయన ఫార్ములా… కానీ ఒక దేశంలో అది అపర కుబేరులకే సాధ్యమయ్యే లగ్జరీ, మరో దేశంలో సగటు జీవి అందుకోగలిగే నిత్యావసరం! ప్రపంచ పెద్దన్న, సూపర్ పవర్ అమెరికాలో ఒక్క టాబ్లెట్ ధర అక్షరాలా 900 డాలర్లు… అంటే మన కరెన్సీలో దాదాపు 85,000 రూపాయలు. అదే మందు, అదే ఫార్ములా భారత్‌కు వచ్చేసరికి కేవలం 35 రూపాయలు… అంటే కేవలం 30 సెంట్లు! వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఇది అక్షర సత్యం.
అమెరికా హెల్త్‌కేర్ సిస్టమ్ పేరుతో జరుగుతున్న ఒక వ్యవస్థీకృత దోపిడీని, భారతీయ ఫార్మా రంగం యొక్క సత్తాను ఎండగడుతూ సోషల్ మీడియాలో ఒక అమెరికన్ మహిళ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దావానలంలా మారుతున్నాయి. అసలు ఏమిటీ మిస్టరీ? ‘మందుల’ వెనుక దాగున్న ఆ ‘మాఫియా’ కథేంటి?
ఆ వీడియోలో ఏముంది?
ఇన్‌స్టాగ్రామ్‌లో “ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్‌కేర్” పేరుతో ‘లిజ్’ అనే అమెరికన్ మహిళ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
దాదాపు 8 లక్షల మందికి పైగా వీక్షించిన ఈ వీడియోలో ఆమె తన ఆంటీ ఎదుర్కొంటున్న భయానక పరిస్థితిని వివరించింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఆంటీ ప్రాణాలు నిలవాలంటే ‘రెవ్లిమిడ్’ అనే బ్రాండెడ్ ఔషధం తప్పనిసరి. అమెరికాలో ఈ మందు ఒక్క టాబ్లెట్ ధర 900 డాలర్లు అంటే మన డబ్బుల్లో రూ. 85,000. అదే మందు భారతదేశంలో కేవలం రూ. 35 నుండి రూ. 300 లోపే లభిస్తోందని ఆమె ఆధారాలతో సహా నిరూపించింది. “అమెరికాలో మనల్ని నిలువునా దోచుకుంటున్నారు” అంటూ ఆమె ఆక్రోశం వెళ్లగక్కిన తీరు, అమెరికన్ వైద్య రంగాన్ని నగ్నంగా నిలబెట్టింది.
ఇది కేవలం లిజ్ అనే ఒక మహిళ వ్యక్తిగత ఆవేదన మాత్రమే కాదు. గత నెలలోనే ‘విక్టోరియా’ అనే మరో అమెరికన్ పౌరురాలు అమెరికా వైద్య వ్యవస్థను బహిరంగంగానే ఒక “స్కామ్” అని తేల్చేసింది. ప్రాణాధారమైన ఒక ఔషధానికి ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజ్ ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆమె ఎదుట వెయ్యి డాలర్లు.. అంటే దాదాపు రూ. 94,000ల భారీ బిల్లు వచ్చి పడింది. విధిలేని పరిస్థితుల్లో ఆమె భారతీయ ఫార్మా తయారీదారుల నుండి నేరుగా ఆ మందును కేవలం 25 డాలర్లకే కొనుగోలు చేయగలిగింది. అమెరికాలో సామాన్య ప్రజలు కార్పొరేట్ శక్తుల చేతిలో ఎలా మోసపోతున్నారో, ఆ అదనపు లాభాలన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రశ్నిస్తూ విక్టోరియా లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు గ్లోబల్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌ను కుదిపేస్తున్నాయి.
ఈ భారీ ధరల వ్యత్యాసం వెనుక దశాబ్దాల చారిత్రక, చట్టపరమైన వ్యూహాలు దాగి ఉన్నాయి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో పెద్దపెద్ద ఫార్మా కంపెనీలు పేటెంట్ చట్టాల సాయంతో దశాబ్దాల పాటు నిర్దిష్ట ఔషధాలపై గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తాయి. పరిశోధనల పేరుతో వారు నిర్ణయించిన ధరలకే రోగులు మందులు కొనాల్సి ఉంటుంది. కానీ భారతదేశం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. 1970ల భారత పేటెంట్ చట్టం ద్వారా ‘ప్రొడక్ట్ పేటెంట్’ స్థానంలో ‘ప్రాసెస్ పేటెంట్’ను తీసుకురావడం ద్వారా భారత్ రివర్స్-ఇంజనీరింగ్ పద్ధతిలో తక్కువ ధరకే ప్రపంచస్థాయి నాణ్యత గల ‘జెనరిక్’ మందులను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. తద్వారా భారతదేశం “ప్రపంచ దేశాల ఫార్మసీ”గా అవతరించింది.
కార్పొరేట్ల నిలువు దోపిడి:
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అన్నట్టు.. అమెరికా నియంత్రణ సంస్థలు ప్రజల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. అమెరికాలో ఉచిత లేదా రాయితీ వైద్యం అందించే ప్రభుత్వ హాస్పిటల్స్ కొరత, ఇన్సూరెన్స్ కంపెనీల మితిమీరిన జోక్యం రోగిని అప్పులపాలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచిత క్యాన్సర్ చికిత్సలు, జన ఔషధి కేంద్రాల ద్వారా అత్యంత చౌకగా జెనరిక్ మందులు లభిస్తున్నాయి. పరిస్థితి ఎలా తయారైందంటే, కొందరు నెటిజన్లు సూచిస్తున్నట్లుగా.. ఒక అమెరికన్ పౌరుడు భారత్‌కు వచ్చి, 10 నుండి 15 రోజులు ఇక్కడ పర్యటించి, వైద్యం చేయించుకుని, మందులు కొనుక్కుని తిరిగి వెళ్లినా… అమెరికాలో అయ్యే ఖర్చు కంటే చాలా డబ్బు మిగులుతుంది! ఇది వైద్య రంగంలో అమెరికా వైఫల్యానికి పరాకాష్ట.
ఈ అంతరం కేవలం సంఖ్యల వ్యత్యాసం కాదు… ఇది లాభాపేక్షకు, మానవత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఒక దేశంలో ప్రాణం నిలబెట్టే మందు కార్పొరేట్ కంపెనీల లాభాల వేటకు సాధనంగా మారితే… మరో దేశంలో అది సామాన్యుడి ప్రాథమిక హక్కుగా మారుతోంది. వైద్యం అనేది వ్యాపారం కాకూడదు, అదొక సామాజిక బాధ్యత కావాలి.
: CLN RAJU (EDITOR- NTV DIGITAL)