Reading Time: 2 minutes
Janhvi Kapoor Instagram Earnings How Much Does She Earn Per Sponsored Post

Janhvi Kapoor: ఒకప్పుడు హీరో హీరోయిన్ల సంపాదన అంటే సినిమాల రెమ్యూనరేషన్, బ్రాండ్ ప్రకటనలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెలబ్రిటీలు ఇప్పుడు తమ డిజిటల్ ప్రభావాన్ని కోట్ల రూపాయల ఆదాయంగా మార్చుకుంటున్నారు. ఈ కొత్త ట్రెండ్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒకరు. శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన ఆమె, ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

జాన్వీ కపూర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.68 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్ వంటి ఇతర సోషల్ మీడియా వేదికల్లో కూడా ఆమెకు విశేష ఆదరణ ఉంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, ఒక బిజినెస్ గా మలచుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు తమ ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్  గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్లు ప్రముఖ కంపెనీలకు అత్యంత విలువైన డిజిటల్ ప్రమోషన్ వేదికలుగా మారాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసే ఒక్క ప్రమోషనల్ పోస్ట్ కోసం సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎక్స్ వేదికపై చేసే ఒక్కో బ్రాండెడ్ పోస్టుకూ లక్షల్లోనే చార్జ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. కేవలం పోస్టులు మాత్రమే కాకుండా, ప్రముఖ బ్రాండ్లతో ఒప్పందాలు కూడా ఆమె ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి. ఒప్పో, లెన్స్‌కార్ట్, తుమి, హావెల్స్ వంటి ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమె, ఈ ఒప్పందాల ద్వారా ఏడాదికి కోట్లల్లోనే సంపాదిస్తున్నట్లు సినీ, మార్కెటింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రతి నెల లైఫ్ స్టైల్, బ్యూటీ, ఫ్యాషన్, గ్యాడ్జెట్స్, టెక్నాలజీ ఉత్పత్తులకు సంబంధించిన అనేక బ్రాండ్ ప్రమోషన్లు ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో కనిపిస్తుంటాయి. ఈ లెక్కన కేవలం సోషల్ మీడియా ద్వారానే నెలకు రూ.1.5 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ప్రస్తుతం ఇంతటి కమర్షియల్ విలువ కలిగిన బాలీవుడ్ నటీమణుల్లో జాన్వీ కపూర్ ముందంజలో ఉన్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాదు, సినిమాల పరంగానూ జాన్వీ కపూర్ భారీ పారితోషికం అందుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటిస్తున్న ఒక్కో చిత్రానికి సినిమా బడ్జెట్, నిర్మాణ సంస్థను బట్టి సుమారు 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నిర్మాతలు కూడా ఆమెకు భారీ పారితోషికం చెల్లించేందుకు వెనుకాడటం లేదు.

ఇక దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా జాన్వీ కపూర్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర చిత్రానికి ఆమె సుమారు 3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పెద్ది చిత్రానికి దాదాపు 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వెండితెరపై స్టార్‌డమ్‌ను, డిజిటల్ ప్రపంచాన్ని బిజినెస్ సూత్రంగా మార్చుకున్న జాన్వీ కపూర్, ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన యువ నటీమణుల్లో ఒకరిగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటున్నారు.